Megha Engineering and Infrastructure Limited houseగత వారం రోజులుగా ఐటీ రైడ్స్ తో జాతీయ స్థాయిలో వార్తలలో నిలిచిన మేఘ ఇంజనీరింగ్ సంస్థ తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రాజెక్టు ను దక్కించుకుంది. రివర్స్ టెండరింగ్ లో భాగంగా ఇప్పటికే పోలవరం మిగిలిన పనులు దక్కించుకున్న ఆ సంస్థ ఇప్పుడు వెలిగొండ టన్నెల్ కాంట్రాక్ట్ కూడా దక్కించుకుంది. పోలవరం లో మరో కాంట్రాక్టు కూడా మేఘ నే దక్కించుకుంది.

ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపుగా 950 కోట్లు ఆదా చేశామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, ప్రాజెక్టులన్నీ ఒకే కంపెనీకి వెళ్లడం, అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా సన్నిహిత సంస్థకు వెళ్లడంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఎన్నికలలో ఈ సంస్థ తెరాస, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున డబ్బులు సర్దినట్టు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి.

మొదట్లో డబ్బులు ఆదా అయినట్టు చూపించి ఆ తరువాత కాస్ట్ ఎస్కేలేషన్ కు వెళ్లడం, ఇక్కడ బదులుగా వేరే కాంట్రాక్టులలో లాభ పడటం, అలాగే ప్రాజెక్టుల నిర్మాణంలో నాసిరకంగా పనులు చెయ్యడం ద్వారా డబ్బులు దండుకోవడానికి ప్లాన్ వేశారని, ప్రతిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దండిగా అందుతాయని రెండు రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా అన్ని ప్రాజెక్టులను మేఘనే దక్కించుకోవడంతో ఈ విమర్శలు మరింత విస్తృతం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఐటీ దాడులలో అనేక అక్రమాలను వెలికి తీశామని, దొంగ లెక్కలు రాశారని, లాభాలు తక్కువగా చూపారని, హవాలా ద్వారా డబ్బు తరలించారని డిపార్టుమెంట్ ఒక ప్రెస్ నోట్ లో తెలిపించి. అయితే అందులో మేఘ పేరు చెప్పకుండా, హైదరాబాద్ కు చెందిన ఒక సంస్థ అని రాయడం విశేషం.