Contractors_Pending_Bills_ii_YCP_Govtఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్లు తయారైంది. పైసా ఆదాయం లేకపోయినా నెల తిరిగేసరికి ఏదో ఓ సంక్షేమ పధకం కోసం కనీసం రూ.5-600 కోట్లు విడుదల చేసే ఏకైక ప్రభుత్వం దేశంలో వైసీపీ ప్రభుత్వం మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం యావత్ దేశంతో పోటీ పడుతోందని సిఎం జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొన్నప్పటికీ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను చెదలు తినేస్తున్నట్లు ఈ పధకాలు, వాటి కోసం చేస్తున్న అప్పులు తినేస్తున్నాయి.

ఈ ప్రభావం ఇప్పటికే లబ్దిదారులతో సహా రాష్ట్ర ప్రజలందరిపై కూడా పెరిగిన చార్జీల రూపంలో పడింది. రాష్ట్రంలో చాలా మంది ప్రజలు తమకు తెలియకుండానే ఆ భారం మోసేస్తున్నారు కూడా. అయితే ప్రభుత్వ బాధితుల జాబితాలో మేము కూడా ఉన్నామంటూ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు చెపుతున్నారు.

స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (సబ్కా) పిలుపు మేరకు వివిద జిల్లాలలో ప్రభుత్వ కాంట్రాక్టర్లు నేడు గుంటూరు జిల్లాకు భారీ సంఖ్యలో తరలివచ్చి, మంగళగిరి వద్దగల ఏపీ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు.

సబ్కా ఉపాధ్యక్షుడు వరప్రసాద్‌ మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ, “మేమందరం గత మూడేళ్ళుగా వివిద కాంట్రాక్టు పనులు పూర్తిచేశాము. ఇంకా అనేక పనులు వివిద దశలలో ఉన్నాయి. కానీ మూడేళ్ళు గడిచినా ప్రభుత్వం ఇంతవరకు మా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్ధిక సమస్యలలో చిక్కుకుపోతున్నాము. కనుక ప్రభుత్వం తక్షణం మా పెండిగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

అలాగే వివిద పనులకు సకాలంలో ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయకపోవడం, డిపార్టుమెంటులలో ఇతర సమస్యల కారణంగా కాంట్రాక్ట్ లభించినప్పటికీ పనులు మొదలుపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం పరంగా ఆలస్యమవడంతో ముడిసరుకు, నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగిపోయాయి. కనుక అటువంటి కాంట్రాక్టుల అంచనా వ్యయాలు పెంచాలని కోరుతున్నాము.

కొన్ని పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయకుండా తాత్సరం చేస్తోంది. ఒకవేళ వాటిని కొనసాగించదలచుకోకపోతే, ఆ పనులను రద్దు చేసి, ఆ పనుల కోసం మా కాంట్రాక్టర్లు చెల్లించిన డిపాజిట్ సొమ్మును తక్షణం వాపసు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వం పెండింగు బిల్లులు చెల్లించకుండా ఆలస్యం చేస్తే రోజురోజుకీ మా ఆర్ధిక పరిస్థితి దిగజారి మా కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి దాపురిస్తుంది. కనుక ఇకనైనా సిఎం జగన్మోహన్ రెడ్డి కలుగజేసుకొని తక్షణం మా పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు.