KCR -ChandrababuNaiduతెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం ఏంచేసినా చెయ్యకపోయినా రెండు రాష్ట్రాల సీఎంలకు మాత్రం తీపి కబురు చెప్పబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన ఫైలు కేంద్ర హోం శాఖ కొంత సమాచారం కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తాజాగా పంపింది.

నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ఈసీ తన అభిప్రాయం చెప్పాలని అందులో కోరింది. ఈ రిజర్వేషన్లను 2001 జనగణన లేదా 2011 జనాభా లెక్కల్లో దేని ప్రాతిపదికన చేయాలన్న దానిపై కొంత వివాదం నెలకొంది. దీనిపై ఎన్నికల కమిషన్‌ తన అభిప్రాయం 3-4 రోజుల్లో చెప్పనుంది.

ఆ అభిప్రాయం వచ్చాక మరో 4 శాఖలకు కూడా హోం శాఖ ఇటువంటి లేఖలు రాయాల్సి ఉంది. వారి నుండి సమాధానాలు వచ్చాక అన్నిటినీ కలిపి తుది ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. వాటిని ప్రధాని ఆఫీసు ఆమోదించాక దీనిని కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందు పెడతారు. ఒకసారి కేబినెట్‌ ఆమోదంతో అది పార్లమెంటు ముందుకు వెళ్తుంది. అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఎన్నికలలోపే ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది.