KVP Special Status, KVP Special Status Bill, MP KVP Special Status Bill, Congress MP KVP Special Status Bill, MP KVP Rajya Sabha Special Status Billఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు భవిష్యత్తు ఏంటో నేడు తేలిపోనుంది. ఈ బిల్లును అడ్డుకోవడంలో అధికార పార్టీ బిజెపి దాదాపుగా విజయవంతమైంది. అయితే బుధవారం నాడు ఢిల్లీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయి, ‘ప్రత్యేక’ బిల్లుపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బిల్లు విషయమై సుదీర్ఘంగా చర్చించిన మీదట, చివరికి బిల్లుపై చర్చకు అంగీకరించిన జైట్లీ.. చర్చ అనంతరం బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు షరతు విధించారు.

హోదా విషయంలో ప్రభుత్వం ఇచ్చే సమాధానం తమకు సంతృప్తిని కలిగిస్తేనే ఆ పని చేస్తామని మరో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. అయితే బిల్లు విషయంలో కేవీపీ తమ మాట వినే అవకాశం లేదని కూడా అన్నారు. గతంలోనూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజ్యసభలో నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు కేవీపీ మాత్రం బిల్లు విషయంలో వెనక్కి తగ్గేది లేదని తాజాగా కూడా ఓ ప్రకటన చేసారు. పార్టీ తనను సస్పెండ్ చేసినా సరే బిల్లును మాత్రం ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెబుతున్నారు.

తొలుత ఎన్నో అడ్డు పుల్లలు వేసిన బిజెపి, ఒక్కసారిగా చర్చకు అనుమతి ఇవ్వడం వెనుక మతలబు ఏంటా? అన్న ప్రశ్నకు… బిల్లును కావాలని అడ్డుకుంటోందని ఏపీ ప్రజల్లో బిజెపిపై వ్యతిరేక భావన ఏర్పడ్డ నేపధ్యంలో… ఈ చర్చకు అనుమతించినట్లుగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు గత రెండేళ్లుగా తాము చేస్తున్న సాయం గురించి ప్రస్తావించి మార్కులు కొట్టేయాలని వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. అందుకే బిల్లుపై రెండు గంటలపాటు చర్చకు అంగీకరించింది. ఈ మధ్యాహ్నం రెండు గంటలకు బిల్లుపై చర్చ ప్రారంభం కానుంది. అంటే మరికొన్ని గంటల్లో బిల్లు భవిష్యత్తు ఏమిటన్నది తేలిపోతుందన్న మాట.