Congress-President-Rahul-Gandhiకాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రేపు కర్నూల్ లో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఇప్పుడు ఈ సభ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కారణం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు చేతులు కలపడమే. ఆంధ్రప్రదేశ్ లో కూడా పొత్తు ఉండబోతుందా అనే చర్చ జరుగుతుంది.

అయితే ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి గానీ ఇంఛార్జ్ ఊమెన్ చాండీ గానీ టీడీపీతో పొత్తు ఉండే అవకాశం లేదని చెప్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాహుల్ రేపు ఏం చెప్పబోతున్నారనేది అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ పొత్తు లేదంటే రేపు రాహుల్ తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని తిడతారా?

ఒక వేళ తిడితే ఆ ప్రభావం తెలంగాణ ఎన్నికల మీదా, అక్కడి పొత్తు మీద ఉండదా? పొత్తు తెలంగాణకు మాత్రమే అని సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. పొత్తు ఉంటుందని ప్రకటిస్తే అది చంద్రబాబుకు ఇబ్బందే. ఈ తరుణంలో అసలు ఇప్పుడు ఈ సభ పెట్టడమే పొరపాటు అన్నట్టుగా ఉంది.