Congress leader tulasi reddy comments on jagan governmentకరోనాని ఎదురుకోవడానికి ఈ ఏడాది బడ్జెట్ లో వైద్య రంగానికి కేటాయింపులు పెంచామని ఒక పక్క జగన్ ప్రభుత్వం ఘనంగా చెబుతుంటే… ఈ ప్రభుత్వానికి పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు పని జానెడు.. ప్రచారం బారెడు అని సెటైర్లు వేశారు.

“2019-20లో ప్రభుత్వం వైద్యశాఖకు బడ్జెట్ కేటాయింపుల్లో 11,499 కోట్లు ఇచ్చింది.. ఖర్చు చేసింది మాత్రం 7,353 కోట్లు మాత్రమే… ఈ జగన్ ప్రభుత్వం కోతల ప్రభుత్వం. ఈ ఏడాది చెబుతున్న మాటలు కూడా అంతే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, కరోనా నియంత్రణలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారు,” అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.

మరోవైపు ఇటీవలే శాసనసభలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఒక్క కరోనా నియంత్రణకే తన ప్రభుత్వం 2,000 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇక ఆ మరుసటి రోజు ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కరోనా నియంత్రణకు తమ ప్రభుత్వం ఏకంగా 5,000 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు.

“ఈ పొంతనలేని మాటలే ఈ ప్రభుత్వం ప్రచారం జాస్తి పని నాస్తి అనే దానికి ఉదాహరణ. మొత్తం వైద్య శాఖకు 7,353 కోట్లు ఖర్చు పెడితే అందులో కరోనా కు 5,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పినా, 2,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పినా నమ్మలేని పరిస్థితి. అది గనుక చేసి ఉంటే కనీసం ఆక్సిజన్ లేని పరిస్థితి ఈరోజు ఉండేది కాదు,” అంటూ సోషల్ మీడియా లో విమర్శలు వస్తున్నాయి.