Congress Leader Jairam Ramesh about special status to APరాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కోలుకోలేనివిదంగా దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పారు. ఆ దెబ్బకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండాపోయింది. ఆ పార్టీలో నేతలలో కొంతమంది రాజకీయ సన్యాసం తీసుకొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యమాలు చేసిన వైసీపీయే రాష్ట్రాన్ని విడగొట్టినవారిని పార్టీలో చేర్చుకోవడంతో వారందరూ కొత్త కండువాలు కప్పుకొని మళ్ళీ ప్రజల ముందుకు ధైర్యంగా రాగలిగారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టించినవారిని వైసీపీ కూడా ఆదరించకుండా ఉండి ఉంటే భవిష్యత్‌లో మళ్ళీ ఎవరూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలతో చెలగాటం ఆడే సాహసం చేసేవారే కారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి సుమారు ఎనిమిదిన్నరేళ్ళవుతున్నా ఇంతవరకు రాజధాని కూడా నిర్మించుకోలేని రాష్ట్రమంటే అందరికీ అలుసుగానే ఉంది. అందుకే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మళ్ళీ ప్రత్యేక హోదా బిస్కట్ వేశారు.

భారత్‌ జోడో పాదయాత్ర చేస్తున్న మకుటం లేని కాంగ్రెస్‌ మారాజు రాహుల్ గాంధీ ఈ నెల 18వ తేదీన కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో ప్రవేశించబోతున్నారు. ఆలూరు నుంచి మంత్రాలయం వరకు నాలుగు రోజుల పాటు 95కిమీ మేర ఆంద్రాలో ఆయన పాదయాత్ర చేయబోతున్నారు. కనుక ఆ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేష్ ఈరోజు కర్నూలులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోంది. 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము,” అని అన్నారు.

ఇంతకు ముందు ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకమునుపు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే చెప్పారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని బల్లగుద్ది పదేపదే చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళవుతున్నా కేంద్రం మెడలు వంచలేదు. 23 మంది ఎంపీలు ఉన్నా ఎవరి మెడలు వంచలేకపోయారు.. ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. కారణాలు అందరికీ తెలిసినవే.

రాజధాని లేని రాష్ట్రం… అప్పులు తప్ప అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చూస్తే అందరికీ అలుసైపోయినట్లుంది. లేకుంటే రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత మొహం చెల్లక ఇన్నేళ్ళుగా మొహం చాటేసిన జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ వంటివారు మళ్ళీ ఈవిదంగా మాట్లాడే ధైర్యం చేసి ఉండేవారు కారు.