Congress Ex Minister J Chittaranjan Das1989లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారకరామరావుపై పోటీ చేసి గెలుపొందిన చిత్తరంజన్ దాస్ ఇప్పుడు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరబోతున్నారు. ఆ సమయంలో కార్మిక శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. ఆ తర్వాత 1994లో మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాటి నుంచి ఆయనకు కాంగ్రెస్ పార్టీ లో టికెట్ దక్కలేదు. ఒకటి రెండు సందర్భాలలో నామినేటెడ్ పోస్టులు మాత్రం ఇచ్చింది.

ఈ ఎన్నికల్లో కొల్లాపూర్ లేదా జడ్చర్ల నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ చిత్తరంజన్ దాస్‌కు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిత్తరంజన్ దాస్.. ఈ నెల 27న రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్లులో జరగబోయే తెరాస సభలో కేసీఆర్ సమక్షంలో తెరాస పార్టీలో చేరనున్నట్లు సమాచారం. చిత్తరంజన్ దాస్‌తో పాటు ఆయన అనుచరులు కూడా కారు పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ చేరిక వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని కాంగ్రెస్ అంటుంది.

ఆయన ప్రభ తగ్గిపోవడం వల్లే ఆయనకు సీటు ఇవ్వడం లేదని, ఇప్పుడు వెళ్లినా పెద్దగా ఉపయోగం లేదని అంటున్నారు. ఎన్టీఆర్ 1989 లో తెలంగాణలో ఓడిపోయాక నందమూరి కుటుంబసభ్యులెవరూ తెలంగాణ నుండి పోటీ చెయ్యలేదు. ఇప్పుడు తొలిసారిగా ఇన్నేళ్ల తరువాత నందమూరి సుహాసిని కూకట్ పల్లి నుండి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలలో కూడా ఆమెను ఓడించి తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు జైంట్ కిల్లర్ గా ఆవిర్భవిస్తారేమో చూడాలి.