Revanth Reddy - Uttam Kumar Reddy - Komatireddyతెలంగాణ ఇచ్చిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. ఉద్యమ పార్టీ ఐన తెరాసకే ప్రజలు పట్టం కట్టారు. నాలుగున్నర ఏళ్ళ పాటు ప్రతిపక్షంలో కూర్చుని కాంగ్రెస్ నేర్చిన పాఠాలు ఏమీ లేవు. రేవంత్ వంటి వారు ఒకటో అరో మీడియా ముందు మాట్లాడటం తప్పితే గట్టిగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది లేదు. ప్రతిపక్షమంతటినీ సభ నుండి బయటకు పంపేసినా, సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ చేసిన వీధి పోరాటాలు ఏమీ లేవు.

అయితే సీనియర్ నేతలంతా ఏసీ రూమ్ లలో కూర్చుని ముఖ్యమంత్రి కావాలని కలలుగన్నారు. ఈ జాఢ్యం ఎంతవరకు ముదిరింది అంటే వారి దెబ్బకు ఒక నాయకుడిని కేసీఆర్ కు ప్రతిగా నిలుచోబెట్టలేనంత. అయితే ఈ కాబోయే, కావాలనుకునే సీఎంల సంఖ్య బాగా పెరిగిపోవడంతో వీరికి ఓటు వేసి గెలిపించినా కొట్టుకు చస్తారు అనుకున్నారేమో ప్రజలు. కాంగ్రెస్ పార్టీని ఓడించడమే కాకుండా సీఎం కాండిడేట్ల అందరిని లైన్లో నిలబడి వరుసగా ఓడించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముక్కుతా మూలుగుతా ఎలాగోలా బయటపడగా… ప్రతిపక్షనేత జానారెడ్డి దగ్గర్నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరకూ అందరూ పరాజయం పాలయ్యారు.

డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, సంపత్ కుమార్‌, కొండా సురేఖ ఇలా ఒకరేంటి కొంచెం పేరు ఉన్న నాయకులు దాదాపుగా ఓడిపోయారు. ఎక్కడో భట్టి విక్రమార్క, గండ్ర వెంకటరమణ రెడ్డి లాంటి ఒకరిద్దరు మినహా. సినియర్లంతా సభలో ఉండగానే తెరాస ఏకచక్రాధిపత్యం నడిచింది. ఈ ఉన్న కొందరితో రేపటి నుండి అసెంబ్లీ ఎలా నడుస్తుందో తలుచుకుంటేనే కాంగ్రెస్ అభిమానుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

కేసీఆర్ దయతలిస్తే పర్లేదు మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష అంటూ బయటకు వస్తే కాంగ్రెస్ ను 2019 లోపే ఖాళీ చెయ్యవచ్చు. ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికలు తెరాస వైపు వెళ్ళిపోయినట్టే ఈ క్రమంలో కేసీఆర్ ఆ పని చేస్తే కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారువుతుంది. శత్రుశేషం ఎప్పుడూ ఉంచుకోకూడదు అని అనుకునే కేసీఆర్ కాంగ్రెస్ పని పట్టడం ఖాయమని ఆ పార్టీ అభిమానులు అంటున్నారు. మరోవైపు తాజాగా ఉన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ కు ఇరవై సీట్ల లోపలే వస్తున్నాయి.