confidence in TDP is danger to YSR Congressకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యింది. అనుకున్నట్టుగానే కార్పొరేషన్ లో అధికార పార్టీ విజయబావుటా ఎగురవేసింది. టీడీపీకి పది శాతం స్థానాలు కూడా రాలేదు.

ఈ ఫలితాలు అనుకున్నవే కాబట్టి పెద్దగా మీడియాలో కూడా చర్చ జరగలేదు. అయితే తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఈ ఫలితాల కారణంగా ఎటువంటి బాధ లేకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో చూస్తే.. ఇవే ఎన్నికలు ఇప్పుడు జరిగితే ఫలితాలు వేరేగా ఉండేవని వారు చర్చించుకుంటున్నారు.

ఎన్నికలు జరిగిన నాటి నుండీ ఈరోజు వరకు పరిస్థితులు బాగా మారాయని ప్రభుత్వ వ్యతిరేకత మొదలయ్యిందని టీడీపీ వారి అభిప్రాయం. ఏలూరు అనేది అర్బన్ ఏరియా… ప్రభుత్వం పంచే ఉచితాల ప్రభావం తక్కువగానే ఉంటుంది. అయితే టీడీపీ అన్నట్టుగా ప్రభుత్వ వ్యతిరేకత ఉందా అంటే అది ఎవరు చెప్పగలరు?

ఉపఎన్నికలు ఏ పార్టీ పరిపాలనకు రెఫరెండం కాదని గతంలో చాలా సార్లు రుజువయ్యింది. అయితే ప్రజా వ్యతిరేకత పెరిగిందా అనే చర్చ పక్కన పెడితే.. పెరిగిందని ప్రతిపక్షాలు నమ్మడం కూడా అధికారంలో ఉన్న వారికి ప్రమాదమే. 23 సీట్లు మాత్రమే వచ్చిన పార్టీని ఆ నమ్మకమే నడిపిస్తుంది.

ఒకసారి నడక మొదలైతే అది పరుగుగా కూడా మారొచ్చు. కాబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ జాగ్రత్తగానే ఉండాలి. అయితే సహజంగా అధికారం అటువంటి వాటిని కనపడనివ్వదు.