YSR-Kalyanamasthu-ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంక్షేమ పధకాల భారంతో క్రుంగిపోతోంది. వాటి కోసం ఎడాపెడా అప్పులు చేస్తోంది. కనుక వాటి భారం తగ్గించుకొనేందుకు వాటిపై రకరకాల ఆంక్షలు, నిబందనలు విధిస్తోంది కూడా. అయినా వైసీపీ ప్రభుత్వం కొత్తగా మరో రెండు సంక్షేమ పధకాలను ప్రకటించి అమలుచేయడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. అవే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పధకాలు.

ఈ పధకాల కింద రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కనిష్టంగా రూ.40 వేలు నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు చెల్లించబోతోంది. వారిలో భవన నిర్మాణ కార్మిరికుల ఆడపిల్లలకు 40 వేలు, బీసీలకు రూ.50వేలు, బీసీ కులాంతర వివాహాలకు రూ.75 వేలు, ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు, వారిలో కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, దివ్యాంగుల పిల్లలకు రూ.1.50 లక్షలు చొప్పున అందించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

అమ్మఒడి పధకం ద్వారా నిరుపేదల పిల్లలను చదువుల బాట పట్టించామని, ఇప్పుడు వారి వివాహాలకు కూడా ఆర్ధికసాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ రెండు కొత్త పధకాలు ప్రవేశపెడుతున్నామని సిఎం జగన్ చెప్పారు. బాల్య వివాహాలను అరికట్టడానికి, అందరూ కనీస విద్యావంతులు అవ్వాలనే సదుద్దేశ్యంతోనే వధూవరులకు వయోపరిమితి 18,21 ఏళ్ళుగా నిర్ణయించామని, తప్పనిసరిగా పదో తరగతి పాస్ అయ్యుండాలనే షరతులు కూడా విధించామని సిఎం జగన్ చెప్పారు.

నిరుపేద ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికసాయం చేయాలనుకోవడం చాలా అభినందనీయమే. అయితే ప్రభుత్వోద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లించలేకనే ఆపసోపాలు పడుతున్న వైసీపీ ప్రభుత్వం, ఒక్కొక్క జంటకీ రూ.40 వేలు నుంచి రూ.1.50 లక్షలు చొప్పున పంచాలంటే ఎన్ని వేలకోట్లు కావాలి?అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది?

రాష్ట్రానికి భారీగా ఆదాయం ఉండి ఉంటే దాంతో నిరుపేద ప్రజలను తప్పకుండా ఆదుకోవచ్చు. కానీ ఉద్యోగుల జీతాల కోసం, సంక్షేమ పధకాల కోసం, చేస్తున్న అప్పులు.. వాటి వడ్డీల చెల్లింపుల కోసం నెలనెలా అప్పులు తెచ్చుకొంటూ ఇంకా ఆర్ధికభారం పెంచుకోవడం విజ్ఞత అనిపించుకొంటుందా?తలకు మించిన భారం ఎత్తుకొని వాటి భారం తగ్గించుకొనేందుకు మళ్ళీ సవాలక్ష షరతులు, నిబందనలు విధించడం దేనికి?

ఇందుకు ప్రభుత్వం ఎంత కవరింగ్ ఇచ్చుకొన్నప్పటికీ ఆ పధకాల భారం పెరగకుండా లబ్దిదారులను ఫిల్టర్ చేసి తగ్గించేందుకే ఈ షరతులు, నిబందనలని చెప్పవచ్చు. ఈ రెండు కొత్త పధకాలకు కూడా అనేక షరతులు, నిబందనలు విధించడమే ఇందుకు ఉదాహరణ. ఈ పధకాల పేరుతో ‘అర్హులైన ఓటర్లకు’ డబ్బు పంచిపెడుతూ ఎన్నికల వైతరణిని దాటాలని జగన్ భావిస్తున్నారు. గడప గడపకి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్ళి ఈ పధకాల గురించి చెప్పి ఓట్లు అడగమని చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఎన్నికలలో వైసీపీని గెలిపించుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, దాని భవిష్యత్‌ని కూడా పణంగా పెట్టడాన్ని ఎవరూ హర్షించలేరు.