మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ పదవికి తీవ్రమైన పోటీ ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ అలాగే విష్ణు మంచు ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అలాగే పరిశ్రమ పెద్దల మద్దతు పొందే పనిలో ఉన్నారు. ఈలోగా నిన్న సాయంత్రం, జీవిత రాజశేఖర్ బరిలోకి దిగినట్లు ప్రకటించారు.
తాజాగా మరో సీనియర్ నటి హేమ కూడా మా ప్రెసిడెంట్ పదవికి పోటీ చెయ్యనున్నట్టు ప్రకటించారు. మా చరిత్రలో ఎప్పుడూ, ప్రెసిడెంట్ పోస్ట్ కోసం ఇంత తీవ్ర పోటీ నెలకొనలేదు. మొదట్లో ప్రెసిడెంట్ పదవి ఏకగ్రీవమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా నలుగురు పోటీ పడుతున్నారు.
కొంపతీసి ఓటర్ల కంటే పోటీ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారా ఏంటి? అంటూ సోషల్ మీడియా జోకులు పేలుతున్నాయి. పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని, ఒకరు లేదా ఇద్దరు అభ్యర్థులను వెనక్కి తగ్గేలా చూసే అవకాశం ఉందని అంటున్నారు. మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ విష్ణు మంచుకు మద్దతు ఇస్తున్నట్లు చెబుతారు.
ఏ అభ్యర్థి అయినా ఎన్నికల్లో గెలవడానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు అవసరం కావొచ్చు. ప్రస్తుతానికి చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండటంతో ఆయన మద్దతు ఉంటే గెలుపు తేలిక అవుతుంది. చిరంజీవి ఇప్పటివరకు తన మనసులోని మాట బయటకు పెట్టలేదు. అయితే చిరంజీవి తమ్ముడు నాగబాబు ఇప్పటికే ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలిపి ప్రచారం కూడా చేస్తున్నారు.