common points on khaleja and agnyaathavaasiదర్శకుడిగా “నువ్వే నువ్వే”తో కెరీర్ ప్రారంభించిన ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటివరకు 9 సినిమాలకు దర్శకత్వం వహించగా, అందులో 7 సినిమాలు సూపర్ హిట్ గా నిలువగా, మహేష్ తో తీసిన ‘ఖలేజా,’ తాజాగా పవన్ తో తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయితే ‘అజ్ఞాతవాసి’ సినిమాకు ఎదురవుతున్న విమర్శలు ‘ఖలేజా’కు వ్యక్తం కాలేదు. ‘అజ్ఞాతవాసి’ అంత దారుణం కాకపోయినా, బాక్సాఫీస్ వద్ద ‘ఖలేజా’ కూడా నిలబడలేకపోయింది.

అయితే ఆ సినిమాను ఇప్పటికీ ఎంజాయ్ చేసే ప్రేక్షకుల సంఖ్యకు ఏ మాత్రం కొదవుండదన్న విషయం ఆ సినిమా బుల్లితెరపై ప్రదర్శితమవుతున్న తీరే చెప్తుంది. కానీ ‘అజ్ఞాతవాసి’ విషయంలో అలా కాదు. పవన్ చేత చేయించిన నటవిశ్వరూపంకు తోడు, కాపీ ఆరోపణలు, పేలవమైన పంచ్ లు… మొత్తంగా త్రివిక్రమ్ ను రౌండప్ చేసాయి. ఇదిలా ఉంటే… ఈ రెండు సినిమాలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకోకుండా ఓ రెండు కామన్ ఎలిమెంట్స్ ను పెట్టారు.

అవే… కుర్చీ… తాడు..! అవును… ‘ఖలేజా’ సినిమాలో యూనివర్సిటీ డీన్ ను, గంగాధర్ ను ఎత్తుకొచ్చి మహేష్ – అలీలు చేసే కామెడీ ఎంతగా పండిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘కామెడీ చేయాలంటే నేనే చేయ్యాలిరోయ్’ అంటూ ప్రిన్స్ వేసిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సరిగ్గా ఇదే సెంటిమెంట్ ను ‘అజ్ఞాతవాసి’లో కూడా వినియోగించారు త్రివిక్రమ్. ‘వెన్నెల కిషోర్ అండ్ కో’ను కుర్చీ, తాడ్లులతో కట్టేసిన వైనం బహుశా త్రివిక్రమ్ కు ఈ సెంటిమెంట్ అచ్చివచ్చినట్లు లేదేమో! అని అనిపించక మానదు. మున్ముందు సినిమాలలో ఈ తాడ్లు, కుర్చీ జోలికి త్రివిక్రమ్ వెళ్ళకుండా ఉంటే మంచిదేమో!