Comedian Sunil TRS political campaignతెలంగాణాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను మరిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో పోటాపోటీగా నగదు పంపిణీ జరిగింది. అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో అభ్యర్థులు ప్రచారం చేశారు. డమ్మి బ్యాలెట్‌ పత్రాలు ఇస్తూ వాటిలో రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు నగదును పెట్టి ఓట్లు అభ్యర్థించినట్లు సమాచారం. చాలా చోట్ల ప్రతిపక్షాలు పెద్దగా పోటీ ఇవ్వకపోయినా పార్టీ గుర్తులపై జరగని కొన్ని చోట్ల తెరాసలోనే వివిధ వర్గాలు ఏర్పాడి వారిలో వారు కొట్టుకుంటున్నారు.

ఈ ఎన్నికలను తెరాస ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తమ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచార రథాలతో పల్లెల్లో ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించకపోతే గ్రామాల్లో అభివృద్ధికి తమ సహకారం ఉండబోదని ఎమ్మెల్యేలు చేస్తున్న పరోక్ష హెచ్చరికలు చర్చనీయాంశమవుతున్నాయి. తెరాసలోనే ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ఉన్న గ్రామాలకు తెలివిగా ఎమ్మెల్యేలు వెళ్లకుండా, గెలిచిన వారే తమ సర్పంచ్‌ అని చెబుతున్నారు.

దిలావర్‌పూర్‌ మండలంలోని గుండంపల్లిలో సినీ నటుడు సునీల్‌ ప్రచారం నిర్వహించడం అందరిని ఆకర్షించింది. తన అభిమాని అయిన అభ్యర్థి కోసం ఆయన రంగంలోకి వచ్చారు. అతను తెరాస నుండి పోటీ లో ఉన్నాడు. గ్రామం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరడం విశేషం. సునీల్ ని చూడటానికి ఆ గ్రామం నుండే కాకుండా పక్క గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చి బారులు తీరారు. కాగా ఇప్పటివరకు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ కంటే తెరాస మూడింతలెక్కువ స్థానాలు గెలుపొందడం విశేషం.