సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీకు దండిగా విరాళాలు వస్తున్నాయి. తాజాగా సిసిసి కి సీనియర్ నటుడు రఘుబాబు లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. ఈ లక్ష రూపాయలను గురువారం ఎటువంటి హడావిడి లేకుండా నెఫ్ట్ ద్వారా సీసీసీ కి ట్రాన్స్ఫర్ చేశారు.

అలాగే ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ కి 25 వేల రూపాయలను, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి 25 వేల రూపాయలను, కాదంబరి కిరణ్ మనం సైతం కి 25 వేల రూపాయలను ఇలా మొత్తం ఒక లక్షా 75 వేల రూపాయలను విరాళంగా రఘుబాబు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే… కోట్లలో రెమ్యూనరేషన్లు వసూలు చేసే స్టార్ హీరోయిన్ల కంటే రఘుబాబు చాలా బాగా చేశారనే చెప్పుకోవాలి.

హీరోయిన్లలో చాలా కొద్ది మంది ఈ ఆపత్కాలంలో విరాళాలుగా ఇచ్చారు. ఇక స్టార్ హీరోయిన్లు అయితే మరీ దారుణం ఇచ్చిన అతికొద్ది మంది చాలా తక్కువగా ఇచ్చారనే చెప్పుకోవాలి. ఉదాహరణకు కాజల్ అగర్వాల్ సినిమాకు కోటి తక్కువ కాకుండా ఛార్జ్ చేస్తూ కేవలం 2 లక్షలు విరాళంగా ఇచ్చింది.

సహజంగా ఇటువంటి విషయంలో వారు ఇంత ఇచ్చారు… వీరు ఇంత ఇచ్చారు అనే లెక్కలు వెయ్యకూడదు… కాకపోతే ఇక్కడ చెప్పక తప్పలేదు. చాలా మంది హీరోయిన్లు పరాయి రాష్ట్రాల నుండి వచ్చినా తెలుగు కళామ్మతల్లి వారిని అక్కున చేర్చుకుంది. కష్టపడకుండా ఇక్కడ దాకా వచ్చి ఉండరు అయితే ఇటువంటి ఆపత్కాలంలో వారు ఖచ్చితంగా పరిశ్రమలోని పేదల పక్షాన నిలవాల్సింది. వారు ఖచ్చితంగా నిరాశపరిచారనే చెప్పుకోవాలి.