comedian Pruthvi Rajప్రముఖ కమెడియన్, వివాదాస్పద రాజకీయ నాయకుడు పృథ్వి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పది రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో సోమవారం అర్ధరాత్రి హస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వి తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.

రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ నెగిటివ్ వచ్చిందని ఆ వీడియోలో పేర్కొన్నారు. సీటీ స్కాన్ కూడా చేయించానన్నారు. కొంత మందికి లక్షణాలు ఉన్నప్పటికీ కరోనా నెగిటివ్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పారని పృథ్వి తెలిపారు.

దీనితో ఆసుపత్రిలో చేరానని ఆయన చెప్పుకొచ్చారు. పృథ్వి వీడియోలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు కనిపించారు. ఆయనకు కృత్రిమంగా ఆక్సిజన్ ఇస్తున్నట్టుగా కనిపించింది. దీనితో బహుశా ఆయనకు కరోనా పాజిటివ్ అని అంతా భావిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంతా ప్రార్థిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కేసులు రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణాలో కూడా కేసులు తీవ్రంగా ఉన్నా అక్కడి ప్రభుత్వం సరైన నంబర్లు చూపించడం లేదని వదంతులు వినిపిస్తున్నాయి. వచ్చే మూడు నాలుగు నెలలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని నిపుణులు అంటున్నారు.