చాలా సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న కమెడియన్ అలీ ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చాకా తనకు మద్దతుగా ఇచ్చిన నటులకు ఏవో నామినేటెడ్ పోస్టులు ఇస్తూ వచ్చారు. అయితే ఎస్వీబీసీ చైర్మన్ గా నటుడు పృథ్విని చేస్తే… ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలతో తన పదవికి రాజీనామా చెయ్యాల్సి వచ్చింది.

దీనితో సినిమా వాళ్ళకు పదవులు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలో పడ్డారట. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో అలీ ప్రత్యక్షమయ్యారు. ఆయన వైసీపీని వీడి కమలం పార్టీలో చేరనున్నారని ఈమేరకు పార్టీ నేతలతో చర్చించేందుకు అలీ బీజేపీ కార్యాలయానికి వెళ్లారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అయితే అలీ మాత్రం అదేమి లేదు అంటున్నారు. ఓ హలీవుడ్ దర్శకుడు త్వరలోనే ఇండియాకు రాబోతున్నారని.. ఆయన మోడీని కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని అపాయింట్ మెంట్ కోసం బీజేపీ కార్యాలయానికి వచ్చినట్లు వెల్లడించారు.

కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను ప్రధాని అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరగా.. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు అలీ తెలిపారు. అయితే అలీ చెప్పిన కారణం నమ్మదగేదిగా లేదు అంటున్నారు కొందరు. నిజంగా హాలీవుడ్ నటుడికి మోడీ అప్పాయింట్మెంట్ కావాలంటే అలీని ఎందుకు సంప్రదిస్తారు? నిప్పు లేకుండా పొగ రాదు అని వారు అంటున్నారు.