comedian ali controversial comments on sunil‘నేనేం మాట్లాడినా బూతు అయిపోతోంది… నేనేం మాట్లాడను…’ అంటూ ఒకానొక వేదికపై కమెడియన్ అలీ తన వ్యాఖ్యలను ఉద్దేశించి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. హీరోయిన్లు, యాంకర్ల విషయంలో అలీ వాడుతున్న భాష శృతిమించుతోందంటూ వివాదాలు చెలరేగడంతో, ఇటీవల కాస్త అలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు. అయితే ఈ సారి ఏ హీరోయిన్ ను గానీ, యాంకర్ ను గానీ టార్గెట్ చేయలేదు గానీ, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమా ఆడియో వేదిక మీద అలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

ఇంతకీ అలీ ఏమన్నాడంటే… “కమెడియన్లు హీరోలుగా రాణించగలరు, కానీ అది ఒక లాటరీ లాంటిదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి, లాటరీ అనేది ఒక్కసారే తగులుతుంది, అది తగిలిన తర్వాత నాలుగు డబ్బులు జేబులో వేసుకుని రిలాక్స్ అయిపోవాలి గానీ, మళ్ళీ మళ్ళీ లాటరీ టికెట్లు కొనగూడదు” అంటూ తనకు తోచిన సలహా ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు తొలిసారిగా హీరోగా చేస్తున్న కమెడియన్ సప్తగిరిని ఉద్దేశించి అలీ చేసాడు అనుకోగా, అదే వేడుకలో హీరో సునీల్ కూడా ఉండడంతో, సప్తగిరి కాకుండా సునీల్ హైలైట్ అయారు.

కమెడియన్ గా ప్రవేశించి హీరోగా ఎదిగి సునీల్ చేతులు కాల్చుకున్నారని సినీ వర్గాలలో ఓ టాక్ ఉండడంతో, అలీ వ్యాఖ్యలు సునీల్ ను ఉద్దేశించి చేసినవేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో సునీల్ నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు అవుతుండడంతో, సునీల్ కెరీర్ ఏంటన్న సందేహాలు ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తున్న నేపధ్యంలో అలీ వ్యాఖ్యలు మరింత వేడిని పెంచాయి.

ఇదంతా అలీ ఎవరి పేరు వినియోగించకుండా, అంతా జర్నలైజ్ చేసి మాట్లాడడంతో వచ్చిన తిప్పలు. అయితే అలీ చేసిన వ్యాఖ్యలలో తప్పేముంది, ఒకవేళ సునీల్ ను ఉద్దేశించి చేసినవే అయినా అవి మంచి మాటలే కావడంతో, వినడం వినకపోవడం అనేది వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుందే తప్ప, అందులో అలీదేం తప్పులేదని వ్యాఖ్యానిస్తున్నారు. అలా కాకుండా సప్తగిరీ ఉద్దేశించి చేసినట్లయితే, ఒక విలువైన సూచన అందించినట్లుగా చెప్పవచ్చు. ఇలా అలీ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.