Comedian-ALi-Wife-Zubeda-YS-Jaganప్రముఖ హాస్య నటుడు అలీ నిన్న తాడేపల్లిలో సిఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి తన కుమార్తె పెళ్ళికి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, “నా కుమార్తె పెళ్ళికి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారిని ఆహ్వానించగా తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నన్ను నియమించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొన్నాను. ఈ పదవిలో నేను నాశక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పాను. ఇదే కాక నాకు ఏ బాధ్యత అప్పగించినా చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పాను. గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుగారు నిర్వహించిన ఈ పదవిని నాకు ఇవ్వడం గౌరవంగానే భావిస్తున్నాను. పార్టీలో సీనియర్లు, పెద్దలను కలిసి వారి సలహాలు తీసుకొని ఈ పదవి ద్వారా నేనేమి చేయగలనో అది తప్పకుండా చేస్తాను,” అని అన్నారు.

ముఖ్యమంత్రి అని చూడకుండా ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు దూషిస్తుండటం, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తుందతంపై మీ స్పందన ఏమిటని విలేఖరి అడగగా, అలీ స్పందిస్తూ, “రాజకీయాలలో సహనం చాలా అవసరం. సహనం ఉన్నవారే రాజకీయాలలో రాణించగలరు. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలను రాష్ట్రంలో ప్రజలందరూ నిశితంగా గమనిస్తూనే ఉంటారు. కనుక నోటికి ఏది పడితే అది మాట్లాడితే చివరికి వారే నష్టపోతారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి ఇదేమి బస్సో, రైలో కాదుకదా? సిఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పబలంతో రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారు. దానిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. అందుకే 175 సీట్లు గెలుచుకోగలమని సిఎం సార్ నమ్మకంగా చెపుతున్నారు,” అని అలీ ముగించారు.

అలీ మాటలను బట్టి ఈ పదవితో తాను ఏం బాధ్యతలు నిర్వర్తించాలో తెలియదని అర్దమవుతోంది. తానే ఓ ప్రభుత్వ సలహాదారుననే సంగతి మరిచినట్లు పార్టీలో సీనియర్లు, పెద్దలను కలిసి వారి సలహాలు తీసుకొంటానని చెప్పడం కామెడీయే కదా?అసలు ప్రభుత్వానికి తన సలహాలు అవసరమే లేదనే విషయం అలీకి కూడా తెలుసు. అందుకే వస్తున్న నవ్వును ఆపుకోలేక ముసిముసినవ్వులు నవ్వుతూ ఏం చేయాలో తెలుసుకొని చేస్తానని అన్నారు.

ఇది కాకుండా ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని చెప్పడం అంటే తనకు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు అర్దమవుతూనే ఉంది. నిజానికి ఎప్పటికైనా ఎమ్మెల్యే అవ్వాలనే కోరికతోనే అలీ రాజకీయాలలో ప్రవేశించారు తప్ప డబ్బు, సమాజంలో గుర్తింపు, గౌరవం, ప్రజాధారణ లేక కాదనే విషయం అందరికీ తెలుసు. మరి ఆయన కార్యకర్తలు నెరవేరుతుందో లేదో?

ప్రస్తుతానికి మొక్కుబడిగా ఏదో ఓ పదవి కూడా కట్టబెట్టినందున రేపటి నుంచి తన ఆప్తమిత్రుడు పవన్‌ కళ్యాణ్‌ని విమర్శించమని, నోటికి వచ్చిన్నట్లు తిట్టమని వైసీపీ ఒత్తిడి చేస్తే, రాజకీయాలలో హుందాగా ఉండాలని చెపుతున్న అలీ అప్పుడు ఏం చేస్తారో చూడాల్సిందే. పాపం అలీ… పదవి వచ్చిందో లేక దాంతో వైసీపీలో కట్టేయబడ్డారో తెలీని అయోమయంలో ఉన్నారు.