CM Jagan mohan Reddy meeting with YCP MLAs at Tadepalli camp office ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సమావేశమయ్యి వారి పనిఈరుని సమీక్షించారు. ఈ సందర్భంగా వారి పనితీరు గురించి ఐప్యాక్ ఇచ్చిన నివేదికను చదివివినిపించి వారిలో 27 మంది ఎమ్మెల్యేల పనితీరు అసలు బాగోలేదని ఖరాఖండీగా చెప్పేశారు.

“గత మూడేళ్ళుగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నామని, వాటితో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని గట్టిగా నమ్ముతున్నందునే నేను వచ్చే ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాను. పరీక్ష పాస్ అవ్వాలంటే షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. కష్టపడి చదివి పాస్ అవ్వాల్సిందే. ఇదీ అంతే. మళ్ళీ మనం ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవ్వాలంటే మిగిలిన ఈ 19 నెలల్లో ప్రతీ ఒక్కరూ తమ తమ నియోజకవర్గాలలో ప్రతీ ఇంటికీ వెళ్ళి మన ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పధకాల గురించి వివరించి ఓట్లు అడగాల్సిందే. కాదని ఇంట్లో కూర్చోంటే ప్రజలు మనల్ని ఇంట్లోనే కూర్చోమంటారు. మన మీద కోట్లమంది ప్రజలు ఆశలు పెట్టుకొన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో 175కి 175 సీట్లు మనం కొట్టాల్సిందే. మళ్ళీ నవంబర్‌లో మరోసారి సమావేశమై అందరి పనితీరును సమీక్షిస్తాను. ఆలోగా అందరూ మెరుగు పరుచుకొంటే మంచిది లేకపోతే ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు,” సిఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెపుతున్నారు. ఆయన పరిపాలన బాగోలేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అయినా వచ్చే ఎన్నికలలో వైసీపీ 175 సీట్లు గెలుచుకోగలదని ఎలా అనుకొంటున్నారో తెలీదు. బహుశః 175 సీట్లు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకి సరిపడే సీట్లు అయినా వస్తాయనే ఆలోచనతోనే ఈవిదంగా ఒత్తిడి చేస్తున్నారేమో? లేదా వైసీపీ 175 సీట్లు గెలుచుకోబోతోందని పదేపదే ప్రజలకు బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారో లేక వైసీపీకి గట్టి సవాళ్ళు విసురుతున్న టిడిపిలో ఈ వ్యూహంతో భయాందోళనలకు గురిచేస్తూ బలహీనపరచాలని ప్రయత్నిస్తుండవచ్చు.

అయితే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు, మారుతున్న రాజకీయ సమీకరణలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరగబోవని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికలు టిడిపికి జీవన్మరణ సమస్యవంటివి కాగా, జగన్ సంక్షేమ పధకాలకి, నిర్ణయాలకి రిఫరెండం వంటివని చెప్పవచ్చు. కనుక ఆ రెండు పార్టీల మద్య చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది. ప్రత్యేకహోదాలాగ 175 సీట్ల ఆలోచన కూడా ఓ భ్రమగానే మిగిలిపోవచ్చు.