తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఏపీలో పరిస్థితులు హాట్ టాపిగ్గా మారుతున్నాయి. 2014 ఎన్నికల్లో కలిసి పోటీచేసిన టీడీపీ, జనసేన పార్టీలు…మరోసారి పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని తిరిగేలా కనిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు సమాచారం.
అయితే బీజేపీతో రాజకీయ స్నేహం చేస్తున్న జనసేన వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీతో దోస్తీ ఖాయం అన్నట్లుగానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య ఒప్పందం కూడా కుదిరినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది.
అయితే ఈ మధ్యే టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తన మనసులో మాట బయటపెట్టారు. పై స్థాయిలో జనసేనతో పొత్తు గురించి చర్చ ఎంతవరకు సాగుతుందో తెలియదు కానీ…దిగువస్థాయి క్యాడెర్ లెవల్లో మాత్రం రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారని కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఈ పరిణామాలన్నింటిపై జనసేన సీనియర్ నేత నాదేండ్ల మనోహర్ స్పందించారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. టీడీపీతో, జనసేనకు పొత్తు ఉంటుందనిపించేలా మాట్లాడారు. పొత్తు పెట్టుకుంటే తప్పేంటని పరోక్షంగా ఒక హింట్ కూడా ఇచ్చారు.
2019 ఎన్నికల్లో పవన్ అభిమానులకు స్పష్టత కొరువడింది. దీంతో టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకునే స్థాయికి వెళ్లారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ ను ఇప్పటి నుంచే మెంటల్ గా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ, జనసేన పొత్తు ఖాయం అన్నట్లు స్పస్టం అవుతోంది.