clashes between directors and heroes in tollywoodకొద్దిరోజుల క్రితం యాక్షన్ కింగ్ అర్జున్ హీరో విశ్వక్ సేన్ మధ్య తలెత్తిన వివాదం పరిశ్రమలో రెండు మూడు రోజులు హాట్ టాపిక్ గా నిలిచింది. న్యూస్ ఛానళ్ళు, యూట్యూబ్ బ్యాచులు ఈ టాపిక్ మీద డిబేట్లు వీడియోలు చేసి పండగ చేసుకున్నాయి. దీన్ని అంత తేలిగ్గా వదలనని చెప్పిన అర్జున్ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు దాకా వెళ్ళాడు. మధ్యలో ప్రాణ స్నేహితుడు జగపతిబాబుని కలుసుకున్నాడు కానీ ఇద్దరూ ఏమనుకున్నారనేది బయటికి రాలేదు. కొంచెం హడావిడి తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది. మొన్నో ఈవెంట్ లో విశ్వక్ తన వెర్షన్ చెప్పేసుకున్నాడు. తప్పు ఉందా లేదా అనే కోణం అన్ని అభిప్రాయాలూ కరెక్టే అనిపించేలా సాగాయి.

ఇంకొంత కాలం ఆగాక ఇది అందరూ మర్చిపోయేదే. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఏం చర్యలు తీసుకుంటారనేది ఒక మ్యానువల్ లాంటిది ఏదైనా రూపొందిస్తే బాగుండేది. అర్జున్ మొన్న మా అధ్యక్షుడు మంచు విష్ణుని కూడా కలిశాడు. అంత పెద్దాయన వస్తే మరి ఫిర్యాదుని తీసుకున్నాడా లేక సర్దిచెప్పి పంపించేశాడా కూడా తెలియలేదు. ఇదంతా మీడియా దాకా రాకపోతే ఏ గొడవా లేదు. ఎప్పుడైతే రచ్చకెక్కుతాయో ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు తీర్పులివ్వడం మొదలుపెడతారు. ముందసలు బయట పెడదామా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది ఇరు పార్టీలే.

మా ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన గొడవలు సైతం పరిష్కారం లేకుండానే ముగిశాయి. ఇలాంటివి ఎప్పుడూ జరగలేదని కాదు. మొన్నామధ్య ఒక కన్నడ టీవీ ఆర్టిస్టు ఇక్కడి సిబ్బంది మీద చేయి చేసుకోవడం పెద్ద రాద్ధాంతం చేసింది. వ్యవహారం దేహశుద్ధి దాకా వెళ్ళింది. ఇంకా వెనక్కు వెళ్తే రుద్రవీణ కథను తన జనం మనం సినిమా నుంచి కాపీ కొట్టారని దాని దర్శక హీరో మాదాల రంగారావు ప్రెస్ మీట్ పెట్టడం అప్పట్లో సెన్సేషన్. బాలచందర్ మీద విమర్శలు చేశారు. కానీ తమ్ముడు లాంటి చిరంజీవి మీద గౌరవంతో దాన్ని పెద్దది చేయకుండా వదిలేస్తున్నానని చెప్పి దానికి శుభం కార్డు పలికారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.

చిన్న కుటుంబంలోనే ఎన్నో కలతలు వస్తుంటాయి. అలాంటిది వేలాది లక్షలాది పని చేసే పరిశ్రమలో రావడం వింతేమీ కాదు. కాకపోతే ఫ్యామిలీ వ్యవహారాలు గుట్టుగా ఉంటాయి. ఇండస్ట్రీ కథలు కోట్లాది పబ్లిక్ లోకి వెళ్తాయి. మున్ముందు ఇలాంటివి జరిగినప్పుడు రిపీట్ కాకుండా ఏం చేయాలో అనే దాని మీద సరైన కార్యాచరణ ఇప్పటికీ లేదు. తప్పు ఎవరైనా చేయొచ్చు హీరో దర్శకుడు నిర్మాత దానికి ఎవరూ అతీతం కాదు. ఇటీవలే కాలం చేసిన కాట్రగడ్డ మురారి గారి నవ్విపోదురుగాక పుస్తకంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. టీ కప్పులో తుఫాను ఇల్లు ముంచేదాకా రాకుండా ఉండాలంటే మారుతున్న తరంలోని హీరోల దూకుడుకి కళ్ళాలు వేస్తూ ఉండాలి.