clarity on RRR movie postponementజనవరి 7వ తేదీన “ఆర్ఆర్ఆర్” రిలీజ్ కాబోతోంది. దీనిపై నిన్న రాత్రి వరకు ఎలాంటి సందేహాలు లేవు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాత్రి కర్ఫ్యూతో “ఆర్ఆర్ఆర్” రిలీజ్ పై సందేహాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా వాయిదా పడిపోయిందని, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఒక్కటే సంక్రాంతికి రాబోతోందని వార్తలు గుప్పుమన్నాయి.

మహారాష్ట్ర కర్ఫ్యూకు ఊతమిచ్చేలా ఏపీలో కూడా పరిస్థితులు సర్దుమణగకపోవడం ఈ వాయిదా వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే… “ఆర్ఆర్ఆర్” వాయిదా వేయడం అనేది సాధ్యం కాని అంశం. ఒకవేళ సంక్రాంతి సీజన్ ను వదిలేస్తే, ఈ సినిమా రిలీజ్ చేయడానికి మరో ప్రత్యామ్నాయ విడుదల తేదీ లేదు.

ఓమిక్రాన్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న నేపథ్యంలో, రాబోతున్న రోజులు మరింత గడ్డుగా మారనున్నాయి. అంటే నిబంధనలు మరింత కఠినతరం అవుతాయి. మహారాష్ట్రతో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఇదే ధోరణిని అనుసరించవచ్చు. అయితే దానికి ఒకటి, రెండు నెలలు టైం పడుతుంది. ఈ లోపున “ఆర్ఆర్ఆర్” రిలీజ్ హంగామా ముగిసిపోతుంది.

మహారాష్ట్ర, ఏపీ వంటి ఒకటి, రెండు రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుని వాయిదా వేసుకుంటే నష్టపోయేది ఖచ్చితంగా “ఆర్ఆర్ఆర్” చిత్ర యూనిట్టే! ఎందుకంటే ఇప్పటికే యుఎస్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమాపై ఏర్పడ్డ బజ్ తో 1 మిలియన్ డాలర్స్ పైనే ప్రీ బుకింగ్స్ జరిగిపోయాయి. ఇదే ఒరవడి ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలలో కూడా కనపడుతోంది.

ఇప్పుడు ఏర్పడిన పాజిటివ్ బజ్ ను చిత్ర యూనిట్ ఎంత కాలమో కొనసాగించలేదు, జనవరి 7 రిలీజ్ అనుకుని దేశవ్యాప్తంగా చేసిన పబ్లిసిటీ అంతా వృధా ప్రయాసగా మారిపోతుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఆర్ఆర్ఆర్ రిలీజ్ ను పురస్కరించుకుని అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ పెద్ద సినిమాలు వాయిదాలు వేసుకున్నారు.

మరొకసారి పోస్ట్ పోన్ చేసి, మళ్ళీ ఇతర సినిమా డేట్స్ పై ఆధారపడి రిలీజ్ చేయడం అన్నది ఇప్పట్లో సాధ్యం అయ్యే అంశం కాదు. ఎందుకంటే టాలీవుడ్ లో సమ్మర్ ముగిసే వరకు సినిమాల రిలీజ్ డేట్స్ ను మార్చేసి లైన్ లో పెట్టారు. ఇక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో ప్రేక్షకులలో ఊపు తీసుకురావడం కూడా చాలా కష్టసాధ్యం.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే… ఫైనల్ కాపీ కూడా పూర్తయ్యి సినిమా రెడీగా ఉంది. దీనిని మరో ఆరు నెలల పాటు ఎలాంటి లీక్స్ లేకుండా కాపాడడం అంటే ‘రాజమౌళి అండ్ కో’కు తలకు మించిన భారంగా మారుతుంది. ఏ రకంగా చూసుకున్నా “ఆర్ఆర్ఆర్” జనవరి 7వ తేదీన విడుదల కావడం అనేది పక్కా! ఇందులో ఎలాంటి పుకార్లకు తావు లేదు.