Circular on YS Jagan OTS Schemeగడిచిన కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో ఓ సర్క్యులర్ తీవ్రస్థాయిలో హల్చల్ చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి గ్రామ పంచాయితీ కార్యాలయం జారీ చేసిన ఈ సర్క్యులర్, ఇటీవల ఏపీ సర్కార్ ఇచ్చిన OTS పధకానికి సంబంధించినది.

OTS పధకం క్రింద లబ్దిదారులు చెల్లించాల్సిన పదివేలు చెల్లించని పక్షంలో, సదరు కుటుంబ సభ్యుల యొక్క పెన్షన్ మరియు ఇతర ప్రభుత్వ పధకాలను ఆపివేయాలని గ్రామ వాలైంటర్లకు సంతబొమ్మాళి గ్రామ సచివాలయం ఆదేశాలు జారీచేసింది.

ఒకవేళ ఈ ఆదేశాలను వాలైంటర్లు ఉల్లంఘిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, సదరు మొత్తం వసూలుకు వారినే బాధ్యులను చేస్తామని హెచ్చరికలు కూడా పంపారు. ఇదంతా మండల పరిషత్ మౌఖిక ఆదేశాలుగా ఈ లేఖలో గ్రామ సచివాలయం పేర్కొంది.

ఓ పక్కన ఈ ‘వన్ టైం సెటిల్మెంట్’ పథకంపై రాష్ట్రంలో ప్రజల నుండి తీవ్ర విముఖత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో… తాజాగా హల్చల్ చేస్తోన్న ఈ నోటీసు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. అయితే ఈ ఆదేశాలు ఒక్క శ్రీకాకుళం జిల్లా వరకే పరిమితమా? రాష్ట్రమంతా ఇదే ఆదేశాలు వెళ్లాయా? అన్నది తెలియాల్సి ఉంది.

ఈ ఉదంతంపై ప్రతిపక్ష నేత నారా లోకేష్ కూడా స్పందించారు. OTS కట్టని వారి ఇంట్లో అవ్వాతాతల పెన్షన్ ఆపేయాలని ఇచ్చిన ఈ సర్క్యులర్ కాల్ మనీ వేధింపులను తలపిస్తోందని అన్నారు. ప్రజలను నిలువు దోపిడీ చేసే పథకంగా, దారిదోపిడి చేసే దొంగలను మించిపోయే విధంగా జగన్ ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు.