ఏపీలో అనావృష్టి... తెలంగాణాలో అతివృష్టి..!ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు తగ్గించడంతో ధియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకం కావడంతో, స్వచ్ఛంధంగా ధియేటర్లను మూసివేసిన పరిస్థితి నెలకొంది. 5 రూపాయలకు టికెట్ అమ్మి ధియేటర్ లను ఎలా రన్ చేస్తామంటూ పెట్టిన గగ్గోలుకు ప్రస్తుతం ప్రభుత్వం కమిటీ వేసి వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది.

ఈ కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం, జగన్ సర్కార్ వాటిని ఆమోదించడం వంటి తదితర కార్యక్రమాలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు గానీ, ధియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో అంటూ సినీ జనాలు నిరీక్షిస్తుండడం ఏపీలో జరుగుతోన్న పరిణామం.

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల పరిస్థితి ఇలా ఉంటే, తెలంగాణాలో రేపటి నుండి మల్టీప్లెక్స్ సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రేపు విడుదల కాబోయే “అర్జున ఫాల్గుణ” సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకునే సినీ అభిమానులకు ఏకంగా ఒక్కో టికెట్ ధర 295 రూపాయలు దర్శనమిస్తున్నాయి.

ఒక్క ఏషియన్ మల్టీప్లెక్స్ మినహా మిగిలిన అన్ని మల్టీప్లెక్స్ ల తీరు ఇదే కావడంతో, మరీ ఈ స్థాయిలో టికెట్ ధరలు ఉంటే చూడడం కష్టసాధ్యంగా మారుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ప్రేక్షకులు ధియేటర్లకు రావడం తగ్గించేస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఒక్క టికెట్ ధరతో ‘ఆహా’ ఏడాది పాటు సబ్ స్క్రిప్షన్ సొంతం చేసుకోవచ్చు.

ఆ మాటకొస్తే చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమాలకు కూడా ఈ స్థాయి ధరలు పెనుప్రమాదాన్నే తీసుకు వస్తాయి. ఫస్ట్ వీకెండ్ వరకు సినిమాపై ఉన్న క్రేజ్ తో వెళ్తారేమో గానీ, తర్వాత ఈ టికెట్ ధరలతో ప్రేక్షకులు సినిమాకు వెళ్లడం అంటే అసాధ్యం. ఒకవేళ సినిమాకు నెగటివ్ టాక్ వస్తే రెండో రోజు నుండే ఖాళీ అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా టికెట్ ధరల పరిస్థితి ఎలా అయిపోయిందంటే… ఉంటే ‘అతివృష్టి’ లేదంటే ‘అనావృష్టి’ మాదిరి మారిపోయింది. ప్రస్తుత చర్చల దశలో ఉన్న ఏపీ ప్రభుత్వంలో అయినా సరైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం. తెలంగాణ సర్కార్ ఈ స్థాయిలో ధరలు పెంచడం రాజకీయంగా ఏపీ సర్కార్ కు కలిసి వచ్చే అంశంగా మారింది.