chritians preachers not llowed to Ponugodu villageవిభిన్న మతాలు, విభిన్న సంస్కృతులకు భారతదేశం నిలయం అన్న విషయం తెలిసిందే. అయితే గడిచిన రెండు దశాబ్దల కాలంలో హిందువులలో ఎక్కువ శాతం మంది క్రైస్తవులుగా మారుతూ వస్తున్న ప్రక్రియ ఎక్కువగా జరుగుతోంది. దైవత్వంపై నమ్మకంతో వెళ్ళే వారు కొందరైతే, ప్రజలకు వచ్చిన ఆపదలను అనుకూలంగా మలుచుకుని, మత ప్రచారం చేస్తూ క్రైస్తవులుగా మారుస్తున్నారన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి.

అయితే గత పదేళ్ళ కాంగ్రెస్ పార్టీ హయంలో ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశంలోనూ కొన్ని కోట్ల మందిని క్రైస్తవులుగా మార్చారని గణాంకాలు చెబుతున్నాయి. దీనిపై పెద్ద చర్చ జరగకపోయినప్పటికీ సామాన్య ప్రజల్లో ఎప్పుడూ చర్చలకు దారి తీస్తూనే ఉన్నాయి. ‘మతం’ అనేది రాజకీయ రంగు పులుముకున్న నేపధ్యంలో ప్రభుత్వాలు కూడా దీనికి అడ్డుకట్ట వేయలేకపోతుందన్నది ఒక వర్గం వాదన. అయితే కొందరు బిజెపి నేతలు ఈ ఉదంతాలపై బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఏది ఏమైనా… ఎవరికి మింగుడు పడినా, లేకున్నా… క్రైస్తవ మతం కూకటివ్రేళ్ళతో దాదాపు ప్రతి గ్రామం, నగరంలోనూ పాతుకుపోయిందన్నది వాస్తవం. అయితే ఇలాంటి వాటికి మా గ్రామం అతీతం అంటున్నారు తెలంగాణాలోని ఓ గ్రామ ప్రజలు. నల్గొండ జిల్లాలోని పొనుగోడు గ్రామ శివార్లలో దీనికి సంబంధించిన బోర్డును సైతం ముద్రించి ఉండడం విశేషం.

“గ్రామ పెద్దల అనుమతి లేకుండా క్రైస్తవ మత ప్రచారకులు గ్రామంలోనికి ప్రవేశించరాదు” అన్న బోర్డుపై ‘జైశ్రీరామ్… జైజైశ్రీరామ్…’ అన్న పదాలను కూడా రాసారు. కేవలం మత ప్రచారకులు మాత్రమే రాకూదని రాసారు తప్ప, క్రైస్తవ మతాన్ని కించపరిచే విధంగా గానీ, మతానికీ వ్యతిరేకంగా గానీ రాయకుండా భారతీయ సంస్కృతిని కూడా చాటిచెప్పారు. ఇలా క్రైస్తవ మత ప్రచారకులకు వ్యతిరేకంగా బహిరంగ ఆంక్షలు విధించడం బహుశా దేశంలోనే తొలి గ్రామం అయి ఉండవచ్చు అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.