Gayle struck 11 sixes in his 47-ballమాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అడ్డా అయినటువంటి ముంబై వాంఖేడే మైదానంలో విండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ సృష్టించిన విధ్వంసానికి ఇంగ్లాండ్ జట్టు విలవిలలాడింది. 182 పరుగుల భారీ స్కోర్ చేయడంతో దాదాపు విజయం తమదేనని భావించిన ఇంగ్లాండ్ జట్టుకు 11 సిక్సర్లతో చుక్కలు చూపించాడు గేల్. ఈ బీభత్సకరమైన ఇన్నింగ్స్ తో 183 పరుగుల భారీ లక్ష్యం కేవలం 18.1 ఓవర్లలోనే విండీస్ చేధించి పాయింట్ల పట్టికలో తమ ఖాతాను ప్రారంభించింది.

48 బంతులను ఎదుర్కొన్న గేల్ 5 ఫోర్లు, 11 సిక్సర్లతో 100 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు తలో చేయి వేయడంతో భారీ స్కోర్ నమోదైంది. రాయ్ 15, హేల్స్ 28, రూట్ 48, బట్లర్ 30, మోర్గాన్ 27, స్టోక్స్ 15 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.

బ్యాటింగ్ విభాగంలో అందరూ కలిసి కట్టుగా రాణించిన ఇంగ్లాండ్ ప్లేయర్లు బౌలింగ్ లో మాత్రం ఆశించిన రీతిలో రాణించకపోవడంతో పరాజయం మూటకట్టుకోవాల్సి వచ్చింది. అద్భుతమైన ఇన్నింగ్స్ తో విండీస్ కు విజయాన్ని అందించిన క్రిస్ గేల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతమైంది. నేడు జరగనున్న మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో శ్రిలంక్ తలపడనుంది.