Chota K Naidu - Kajal Aggarwal-‘టాలీవుడ్ లో మహిళలకు ఇచ్చినంత గౌరవం ఇతర ఏ సినీ ఇండస్ట్రీలలో దక్కదని… నేను చెప్తున్నాను… కావాలంటే రాసి పెట్టుకోండి…’ అంటూ బల్లగుద్ది మరీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. తెలుగు అమ్మాయిలంతా మన చిత్ర పరిశ్రమలోకి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇది చెప్పి 24 గంటలు కూడా గడవక ముందే టాలీవుడ్ స్టేజ్ పైన ఓ అభ్యంతరకర దృశ్యం చోటు చేసుకుంది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన “కవచం” సినిమా టీజర్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో… స్టేజ్ పైన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను చోటా కే నాయుడు ముద్దుపెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ముద్దుపెట్టడం అనేది పక్కన పెడితే… ఇది పక్కా ప్లానింగ్ తో చేసినట్లుగా అనిపించడం మరింత శోచనీయం. కాజల్ ను ముద్దాడిన తర్వాత ‘థమన్ నిన్ను ముద్దాడలేమని చెప్పాడు, ఎందుకు పెట్టలేం” అని చోటా చెప్పడం విశేషం.

ఈ మొత్తం ఎపిసోడ్ లో కాజల్ నవ్వుతూ కనిపించి కవర్ చేసినట్లుగా కనిపించింది, అలాగే చోటాను తన ఫ్యామిలీ మెంబర్ గా అభివర్ణించి వివాదం రేగకుండా జాగ్రత్త పడింది గానీ, ఇలాంటి సంఘటనలతో సభ్య సమాజానికి ఇలాంటి సందేశం ఇస్తున్నట్లో చోటా అండ్ కోనే ఆలోచించుకోవాలి. ఓ పక్కన శ్రీరెడ్డి వంటి వారు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే, అల్లు అర్జున్ ముందుకొచ్చి అలాంటిదేమీ ఉండదని భరోసా ఇస్తున్న తరుణంలో ఇలాంటి అభ్యంతరకర సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరం.