chiranjeevis-producer-jaya-krishna-passed-awayఅప్పటివరకు చిన్నా, చితక పాత్రలు చేస్తున్న చిరంజీవికి “మన ఊరి పాండవులు” సినిమా ద్వారా ఫుల్ లెంగ్త్ హీరో రోల్ ఇచ్చి ప్రోత్సహించిన నిర్మాత జయకృష్ణ ఇక‌లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జయకృష్ణ మంగళవారం నాడు హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. మేకప్‌ మెన్‌గా కెరీర్ ఆరంభించిన జయకృష్ణ 1970, 80, 90 దశకాల్లో మన ఊరి పాండవులు, మంత్రిగారి వియ్యంకుడు, నీకు నాకు పెళ్లంట, సీతారాములు, కృష్ణార్జునులు, వివాహ భోజనంబు వంటి పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. అలాగే 22 డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

సుదీర్ఘ విరామం తరువాత సినీ నటి తారా చౌదరి జీవిత చరిత్రపై సినిమా నిర్మించాలని ప్రయత్నించారు కానీ, అది సఫలీకృతం కాలేదు. జయకృష్ణ ఏకైక‌ కుమారుడు ముద్దుకృష్ణ 2008లో ఆత్మహత్య చేసుకోవడం అతని జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. జయకృష్ణ మృతి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జయకృష్ణ నిర్మించిన చివరి చిత్రం పేరు ‘దాసు.’