Chiranjeevi Waltair Veerayya struggle under pressure of 100 croresఎంత పెద్ద స్టార్లయినా కొన్నిసార్లు బాక్సాఫీస్ పెట్టే కఠిన పరీక్షలకు తలొగ్గక తప్పదు. అమితాబ్ బచ్చన్ అంతటి వారే కౌన్ బనేగా కరోడ్ పతికి ముందు దాదాపు దివాలా తీసే పరిస్థితి తెచ్చుకున్నారు. కట్ చేస్తే ఆ టీవీ రియాలిటీ షో చేసిన అద్భుతం ఏకంగా మరో రెండు దశాబ్దాలకు పైగా సెకండ్ ఇన్నింగ్స్ ని ఇచ్చింది. బ్యాడ్ ఫేజ్ అనేది ఎవరికైన సహజమే. కాకపోతే సరైన టైంలో బౌన్స్ బ్యాక్ అయినప్పుడు అంతా సర్దుకుంటుంది. ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ పరాజయాల తర్వాత బాలయ్య పనైపోయిందని కామెంట్ చేసిన వాళ్ళే అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్, అన్ స్టాపబుల్ టాక్ షో ర్యాంపేజ్ చూసి సైలెంట్ అయ్యారు. జైబాలయ్య బ్రాండ్ మరింత బలపడింది.

ఖైదీ నెంబర్ 150తో కంబ్యాక్ ఇచ్చి వంద కోట్లకు పైగా వసూళ్లతో తన రాకను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవికి ఆ ఆనందం అట్టే ఎక్కువ కాలం నిలవలేదు. డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి మెప్పులు పొందినా ప్యాన్ ఇండియా లెవెల్ లో చూసుకుంటే మొత్తం డబ్బులు తేలేదు. ఆచార్య ఇప్పట్లో మాసిపోయే గాయం కాదు. టీవీలో వచ్చినా చూసేందుకు జనం భయపడేంత దారుణమైన డిజాస్టర్ ని ఎవరూ ఊహించలేదు. కట్ చేస్తే గాడ్ ఫాదర్ అంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా దాన్ని ఓ రెండు వారాల పాటు స్థిరంగా కాపాడుకోలేకపోయింది. నిర్మాత ఓన్ రిలీజ్ అని సర్దిచెప్పారు కానీ ఒకవేళ బయ్యర్లు రంగంలో ఉంటే రిజల్ట్ ఇంకోలా బయటికి వచ్చేది

సరే ఇదంతా గతం అనుకుంటే ఇప్పుడు అసలు సవాల్ వాల్తేర్ వీరయ్య మీద ఉంది. అసలే బాలయ్య వీరసింహారెడ్డితో పోటీ. ఇద్దరూ సంక్రాంతి బరిలో తలపడటం పరస్పరం కొత్తేమీ కాదు కానీ ఊర మాస్ ఎంటర్ టైనర్లతో క్లాష్ కావడం మాత్రం ఎన్నో ఏళ్ళ తర్వాత జరుగుతోంది. చిరంజీవికి మళ్ళీ మళ్ళీ దూరమవుతున్న వంద కోట్ల ఫీట్ ని దర్శకుడు బాబీ సాధించి చూపిస్తాడా లేదానేది ఆసక్తికరంగా మారింది. పైగా చిరు బాలయ్య ఇద్దరికీ నిర్మాత ఒకరే కావడం, ప్రమోషన్ల విషయంలో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చేయలేని పరిస్థితి నెలకొనడం ఇవన్నీ రోజులు గడిచే కొద్దీ ఇబ్బందులు సృష్టించే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఫ్యాన్ వార్ విషయంలో.

ఎంత మాస్ ని టార్గెట్ చేసుకున్నా వాల్తేర్ వీరయ్య మీద పెద్ద భారమే ఉంది. ఏ మాత్రం అటుఇటు అయినా చిరంజీవిని జనం రిసీవ్ చేసుకోవడం లేదనే మెసేజ్ పబ్లిక్ లోకి ఇంకాస్త బలంగా వెళ్తుంది. అలా జరగకూడదంటే మెగా ఎంటర్ టైన్మెంట్ ఓ రేంజ్ లో పండాలి. తమన్ హవాలో మునుపటి మేజిక్ చేయలేకపోతున్న దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఒకప్పటి సంగతి కాదు కానీ ఇప్పుడు మాత్రం ప్రభావం చూపించలేకపోతున్న కోన వెంకట్ స్క్రీన్ ప్లే, ఇప్పటిదాకా రివీలే చేయని శృతి హాసన్ ఫామ్ ఇలా పలు అంశాలు టెన్షన్ పెడుతున్న మాట వాస్తవం. దీని తర్వాత వచ్చే భోళా శంకర్ మీద ఫ్యాన్స్ కే పెద్దగా నమ్మకం లేని పరిస్థితుల్లో భారమంతా వీరయ్య మీదే ఉంది.