Chiranjeevi Tweet on Telangana formation dayనేడు తెలంగాణ అవతరణ దినోత్సవం. తెలంగాణ ఏర్పడి సరిగ్గా ఈరోజుకు ఆరు సంవత్సరాలు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో సంబరాలు తగ్గించారు. మంగళవారం ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అంతకు ముందు ప్రగతి భవన్ లో జాతీయ జండా ఎగురవేశారు కేసీఆర్.

ఇది ఇలా ఉండగా… తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పలువురు ట్వీట్లు వేశారు. అయితే ఈ విషయంగా చిరంజీవి వేసిన ట్వీట్ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. “”ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా,దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీ KCR గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు,” అంటూ ట్వీట్ చేశారు.

నిబద్ధతతో చేశారో, అధిష్టానం నిర్ణయంతో చేశారో గానీ అప్పట్లో చిరంజీవి తెలంగాణ రాష్ట్రాన్ని గట్టిగా వ్యతిరేకించారు. తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. ఇప్పటికీ చిరంజీవి అభిమానులు చంద్రబాబు వంటి వారు రెండు కళ్ళ సిద్ధాంతం అంటే చిరంజీవి ఒక్కరే నిజాయితీగా పోరాటం చేశారని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.

దీనితో మిగతా పార్టీ వారు ఈ ట్వీట్ ను హేళన చేస్తున్నారు. “ఐడియాలజీతో చిరంజీవికి పనేముంది ఇప్పుడు కేసీఆర్ తో పని కాబట్టి ఆయనను ఆకాశానికి ఎత్తేయడమే,” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే విభజన అనేది జరిగిపోయింది. ఇప్పుడు గతం మర్చిపోయి ముందుకు సాగాలి. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షను, అస్తిత్వాన్ని గుర్తించాలి కదా? చిరంజీవి చేసినదాంట్లో తప్పేముంది?