chiranjeevi, maa cine awards, mohan babu, legend controversy, vajrotsavamబాలీవుడ్ హీరోల మాదిరి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోలు స్టేజ్ పై అభినయాలు ప్రదర్శించడం బహు అరుదు. నందమూరి బాలకృష్ణ ఒక్కరే ఇందుకు మినహాయింపు కాగా, అప్పటి స్టార్ హీరోలు మెగాస్టార్, కింగ్, విక్టరీ వంటి హీరోలు ఎప్పుడో నూటికో, కోటికో అలా స్టేజ్ పై కాలు కదిపే వారు. ఇక, ప్రస్తుత తారలు ప్రిన్స్, పవర్ స్టార్, యంగ్ టైగర్, యంగ్ రెబల్ స్టార్ విషయాలైతే చెప్పనవసరం లేదు.

అయితే తెలుగు సినీ ప్రేక్షకులందరూ గుర్తుండిపోయే ‘ఈవెంట్’ ఇప్పటికే ఒకటుంది. 75 సంవత్సరాల సినీ వేడుకల్లో భాగంగా దాదాపు తెలుగు హీరోలంతా ఆ వేడుకపై ఏదొక రూపేణా అభినయించారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చివరి రోజున స్టేజ్ పై స్తేప్పులేసి సందడి చేయగా, ఆ తర్వాత ‘లెజెండ్’ వివాదం చెలరేగిన విషయం… బహుశా ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. చక్కగా సాగిన వేడుకల్లో చివరి రోజు జరిగిన ఆ వివాదం… తెలుగు సినీ పరిశ్రమకే మాయని మచ్చలా మారింది.

అయితే గడిచిపోయిన ఈ ఉదంతాన్ని గుర్తుచేసుకోవాల్సి రావడం ఎందుకంటే… మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి ఒక వేడుకపై డ్యాన్స్ చేయబోతున్నారు కాబట్టి! ఈ నెల 12వ తేదీన జరగబోయే ‘మా సినీ అవార్డ్స్’లో అభిమానులను అలరించేందుకు మెగాస్టార్ చిరంజీవి తన నృత్య ప్రతిభ ఏమిటో మరొక్కసారి చాటి చెప్పబోతున్నారని తెలుస్తోంది. అయితే ఒకసారి మెగాస్టార్ కాలు కదిపితే ఎంత రచ్చయ్యిందో… దీంతో మళ్ళీ ఏమవుతుందో అంటూ… సెంటిమెంట్ ప్రియులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ అలాంటిది ఏదైనా పొరపాటున జరిగితే… సినీ పరిశ్రమకు ఉన్న పేరు ‘సెంటిమెంట్ పరిశ్రమ’ సార్ధకత అవుతుంది. అయితే ఎలాంటి వివాదాలు లేకుండా చక్కగా, ఆహ్లాదకరంగా, కన్నుల పండుగగా వేడుక జరగాలని ఆశిద్దాం. అప్పటికైనా ఈ ‘మెగా’ సెంటిమెంట్లు పటాపంచలు అవుతాయి..!