Chiranjeevi rahul gandhiరాష్ట్ర విభజన వలన జరిగిపోయిన నష్టాన్ని పూడ్చేందుకు ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలని నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు విలువ లేకుండా చేసిన ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వ తీరుకు నిరసనగా… “ఏపీకి స్పెషల్ స్టేటస్ ను మంజూరు చేయాలని” కోరుతూ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మొదటి సంతకం చిరంజీవి పెట్టి ప్రారంభించగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల నుండి మద్దతు కూడగట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా సంతకాలు చేసిన ఈ కార్యక్రమంలో చివరి సంతకం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసి ముగించారు.

బుధవారం నాడు ఏపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా తొలి సంతకం చేసిన మాజీ కేంద్ర మంత్రి చిరంజీవే, స్వయంగా ఆ కాగితాలను పట్టుకుని రాహుల్ గాంధీ వద్దకు తీసుకు వెళ్లి చివరి సంతకం చేయించారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాను రప్పించే బాధ్యతను నెత్తికెత్తుకున్న కాంగ్రెస్ పార్టీ, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా ఆధ్వర్యంలో కోటి సంతకాలతో పాటు ఏపీలోని 13 జిల్లాలలోని మట్టి, నీరు సేకరించి ఢిల్లీ తరలించి తమదైన శైలిలో విమర్శలు కురిపించారు.