Waltair Veerayya Press Meetపెద్ద సినిమా విడుదల ఉన్నప్పుడు అందులో స్టార్ హీరోలు వాటి గురించి ఎలివేషన్లు ఇచ్చుకోవడం సహజం. ఇది అందరూ చేసేదే. కొత్తా వింత ఏమీ లేదు. కొన్నిసార్లు డిజాస్టర్ల తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెనక్కు వెళ్లి చూస్తే అక్కడ ఆయా టీమ్ సభ్యులు మాట్లాడిన మాటలు భలే కామెడీగా అనిపిస్తాయి. సరే బాగున్నా బాగోకపోయినా ముందే నెగటివ్ గా ఎవరూ చెప్పుకోరు కదా. ఇవాళ చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ ని గ్రాండ్ గా అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన పెద్ద షిప్పు లాంటి పడవ సెట్లో వెరైటీగా నిర్వహించారు. ఆలస్యంగా మొదలుకావడం, చెప్పిన టైం కన్నా బాగా లేట్ కావడంతో మీడియా కొంత అసహనానికి గురవ్వడం దీనికీ జరిగాయి.

ప్రశ్నలకు బదులిచ్చే క్రమంలో చిరంజీవి చెప్పిన సమాధానం ఫ్యాన్స్ ఒకపక్క సంతోషం మరోపక్క చిన్న టెన్షన్ రేపెలా ఉంది. ఈ మధ్య కాలంలో రొటీన్ మాస్ చిత్రాలకు ఆదరణ తగ్గుతున్న టైంలో వీరయ్య ఎలా ఉండబోతున్నాడంటే దానికాయన రొటీన్ గానే ఉంటాడని కావాలంటే రాసి పెట్టుకోండని చెబుతూ లోపల మాత్రం షాక్ తినేంత వైవిధ్యమైన ఎమోషన్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసే స్టేట్ మెంటే. నిజంగా అంత ప్రత్యేకత ఉంటే అది రెగ్యులర్ ఎంటర్ టైనర్ ఎలా అవుతుంది. ఆ సముద్రం బ్యాక్ డ్రాప్, రవితేజ సపోర్టింగ్ క్యారెక్టర్. మంచి ఎలివేషన్లు ఇవన్నీ డిఫరెంట్ ఉండబోతున్నాయనేగా అనుకుంటున్నది.

ఈ టైంలో ఇలా చెప్పడం వెనుక పరమార్థం ఏంటో వచ్చే నెల 13న రిలీజయ్యే రోజే చూడాలి. గతంలో ఆచార్య కావొచ్చు గాడ్ ఫాదర్ కావొచ్చు చిరంజీవి ఇదే తరహాలో ఊరించి చెప్పడం ఎవరూ మర్చిపోలేరు. మొదటిది డిజాస్టర్ అయితే రెండోది అన్నీ ఉన్నా ఆశించిన రేంజ్ కు చేరుకోలేక మధ్యలో ఆగిపోయింది. అయినా బ్యాడ్ మూవీ కాకుండా కాపాడుకోగలిగింది. మరి ఇప్పుడు వాల్తేరు వీరయ్య విషయంలోనూ మెగాస్టార్ చూపిస్తున్న కాన్ఫిడెన్స్ నిజమయ్యేలా ఉంటుందో లేదో చూడాలి. వీరసింహారెడ్డితో పోటీ ప్రస్తావన వచ్చినప్పుడు రెండూ ఆడతాయాని భరోసా ఇచ్చిన చిరు మొత్తానికి తన పంధాలోనే సమాధానం ఇచ్చుకుంటూ పోయారు.

వాల్తేరు వీరయ్య హిందీ వెర్షన్ ని అదే తేదీకి విడుదల చేస్తామని నిర్మాత మరోసారి నొక్కి చెప్పారు. నిజానికి మన డబ్బింగులు నార్త్ వాళ్ళు యూట్యూబ్ లో చూస్తారు కానీ అదే పనిగా థియేటర్లకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపించరు. అందుకే ఇక్కడ కమర్షియల్ గా ఎంత పెద్ద రేంజ్ కు వెళ్లినా ఉత్తరాదిలో ఫెయిల్ అయినవి ఎక్కువ. సాక్ష్యాత్తు సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్ర చేస్తేనే గాడ్ ఫాదర్ ముంబై ఢిల్లీ లాంటి సెంటర్స్ లో ఎదురీదాల్సి వచ్చింది. మరి ఏ నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నారో చూడాలి. ఆ టైంలో బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం ఒక్కటే అవకాశంగా చూశారు కాబోలు. సినిమా మరీ ఎక్స్ ట్రాడినరిగా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. చూద్దాం.