Chiranjeevi - Somu Veerrajuమెగా స్టార్ చిరంజీవిది విభిన్న మనస్తత్వం. స్టార్ డమ్ ఎంత ఉన్నా ఆయన ఎప్పుడు మంచివాడు, అందరివాడు అని అనిపించుకోవాలని ఆరాటపడతారు. రాజకీయాలలోకి వచ్చినా కుల ముద్ర పడకుండా తన ప్రయత్నం తాను చేశారు. గతంలో ముద్రగడ విషయంలో ఒక కాపు నాయకుల మీటింగుకు వెళ్లాల్సి వచ్చినా ఆయన ఇప్పటికీ దాని గురించి ఇబ్బంది పడతారని తెలిసిన వారు అంటారు.

అయితే మరో సారి మెగా స్టార్ కు కులముద్ర పడింది. నిన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వీర్రాజు అప్పాయింట్మెంట్ అడిగితే చిరంజీవి కాదనలేకపోయారు. చిరంజీవి గట్టిగా పని చెయ్యాలని జనసేన+బీజేపీ లను అధికారంలోకి తీసుకురావాలని కోరుకున్నట్టు ఏపీ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది.

అయితే కాపులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలోనే బీజేపీ జనసేనతో పొత్తు… వీర్రాజు చిరంజీవిని కలవడం జరిగాయని ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయాయి. వీర్రాజు కూడా అదే సామాజికవర్గం కావడంతో ఆ మీటింగుకు కొంత మంది కులముద్ర వేశారు. దీనికి చిరంజీవి నొచ్చుకున్నట్టు సమాచారం. అడిగితే కాదనలేకపోవడం వల్లే ఇదంతా జరిగిందని వారు అంటున్నారు.

చిరంజీవి ఈ మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ తో సత్సంబంధాలు నెరుపుతున్నారు… ఈ మీటింగు.. అక్కడ చేశారని ప్రచారం జరుగుతున్న వ్యాఖ్యలు కూడా చిరంజీవిని ఇబ్బంది పెడుతున్నాయి. మునుముందు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చిరంజీవి నిర్ణయించుకున్నారట.