Chiranjeevi surgeryక్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి, దానికి గల కారణాలు ఏమిటో వివరించి షాకిచ్చారు. ఇటీవల తిరుపతిలో ఏపీసీసీ చేపట్టిన ‘నీరు-మట్టి’ముగింపు కార్యక్రమానికి మరియు అలాగే అనంతపురం జిల్లా బండ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో చిరు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారానికి బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఈ వార్తలు అవాస్తమంటూ ప్రకటించిన చిరంజీవి, సదరు కార్యక్రమాల్లో పాలుపంచుకోలేకపోయిన కారణాలను వివరిస్తూ మంగళవారం నాడు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

“తన భుజానికి గాయమైందని, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆ గాయానికి చికిత్స తీసుకుంటున్నానని, ఇటీవలే గాయానికి శస్త్ర చికిత్స (ఆపరేషన్) కూడా చేయించుకున్నానని” చిరు తెలపడంతో అభిమానులు షాకయ్యారు. ఈ చికిత్స ముగింపు దశకు వచ్చిందని, ఈ నెల 6న హైదరాబాద్ కు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఏ కారణంగా గాయమైందన్న విషయాన్ని మాత్రం చిరు ప్రస్తావించలేదు. మెగాస్టార్ కు ఏ చిన్న వార్త అయినా అభిమానులకు తెలుస్తుంటుంది. కానీ ఒక ఆపరేషన్ స్థాయికి వచ్చినా ఈ విషయం తెలియక పోవడం పట్ల అభిమానులలో చర్చ మొదలైంది.