అన్ని రోగాలకు ఒకటే మందు పని చేయదన్నది పాత సామెతే కానీ ఎప్పుడైనా వర్తిస్తుంది. జలుబుకి ఉద్దేశించిన టాబ్లెట్ ఒక్కోసారి జ్వరానికి పని చేయొచ్చు. అలా అని ప్రతిసారి అదే వేసుకుంటూ పోతే ఆసుపత్రి బెడ్ ఎక్కాలి. కమర్షియల్ సినిమా సక్సెస్ ఖచ్చితంగా ఎవరూ ముందే ఊహించలేరు కొలవలేరు. ఒక పెద్ద హిట్టు దక్కినంత మాత్రాన తిరిగి అదే మూసలోకి వెళ్ళిపోతే మళ్ళీ మనకు అవే ఫలితాలు వస్తాయనుకోవడం అమాయకత్వం. చిరంజీవి అంతటి సుదీర్ఘ అనుభవమున్న స్టార్ హీరోలకు ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ వాల్తేరు వీరయ్య రిజల్ట్ ఆయనకేవో పొరలు కమ్మేలా చేసింది. తన నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారనే అంచనాలో తప్పటడుగులు వేయిస్తోంది.
సంక్రాంతి సీజన్ ప్రభావమో లేక పోటీగా ఉన్న సినిమాల్లో ఎంటర్ టైన్మెంట్ లేకపోవడమో కారణం ఏదైతేనేం వాల్తేరు వీరయ్య జనాల మెప్పు పొందింది అందులో అనుమానం లేదు. ఒకవేళ ఇదే సినిమా ఏ మార్చిలోనూ అక్టోబర్ లోనో వచ్చి ఉంటే అచ్చంగా ఇవే కలెక్షన్లు వచ్చేవా అంటే తలలు పండిన వీరాభిమానులు సైతం వెంటనే ఎస్ అని చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ టైమింగ్ కలిసి వచ్చిన నిజాన్ని దాచలేరు కాబట్టి. నిన్న యుఎస్ లో స్పెషల్ షోలు వేసుకున్నఫ్యాన్స్ తో చిరు వీడియో కాల్ లో మాట్లాడుతూ ఇకపై మాస్ సినిమాలే చేస్తానని మీకేం కావాలో అర్థమైందని వాల్తేరు వీరయ్యని ఏకంగా గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు టైపు క్లాసిక్స్ తో పోల్చేశారు.
దశాబ్దాలు గడిచినా రౌడీ అల్లుడు, దొంగ మొగుడు లాంటి బ్లాక్ బస్టర్స్ తిరుగులేని మాస్ ఎంటర్ టైనర్స్. ఇవేవీ సంక్రాంతికి వచ్చినవి కాదు. చిరు స్టామినాని సరిగ్గా వాడుకున్న దర్శకులు ఆవిష్కరించిన రియల్ మెగా హిట్స్. కానీ వాల్తేరు వీరయ్యని వీటి సరసన చేర్చడమే అసలు కామెడీ. కంబ్యాక్ లో వింటేజ్ చిరంజీవిని చూడాలని సగటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు నిజమే. కానీ అది ఇలానా అంటే ముమ్మాటికి కాదు. 1995లో రిక్షావోడు, ఎస్పి పరశురామ్ లాంటి రొట్ట రొటీన్ మసాలాలు డిజాస్టర్లు కొట్టినప్పుడు ఏడాది గ్యాప్ తీసుకుంటే జనం హిట్లర్ లోని రియల్ ఎమోషన్ ని ఆదరించారు. అందులో రెండు పాటల్లో అసలు చిరంజీవే ఉండరు. కన్నీళ్లు పెట్టించే సీన్లు క్లైమాక్స్ దాకా క్రమం తప్పకుండ వస్తూనే ఉంటాయి. అయితేనేం బ్రహ్మాండంగా ఆడింది.
అల్లుడు మజాకాలో బూతులకు మహిళా సంఘాలు రోడెక్కి ధర్నాలు చేశాయి. కానీ వసూళ్ల వర్షం కురిసింది. అంతమాత్రాన చిరంజీవి పదే పదే అవే తీయలేదుగా. ఇలాంటివి అవసరమానే శల్యపరీక్ష చేసుకోవాల్సి వచ్చింది. వాల్తేరు వీరయ్య గెటప్ క్యారెక్టరైజేషన్ కు దగ్గరగా అనిపించే అందరివాడుని ఆడియన్స్ అప్పట్లోనే ఎందుకు రిజెక్ట్ చేశారు. ఇది సంక్రాంతికి వచ్చి ఉంటే కొంత సేఫ్ అయ్యేదేమో. కెరీర్ చరమాంకంకు వస్తున్నప్పుడు మెగాస్టార్ ఆలోచించాల్సింది ఎలాంటి మాస్ లు తీయాలని కాదు గుర్తుండిపోయేలా ఎలాంటి కథలు ఎంచుకోవాలని. ఏదో ఇప్పుడు ఆడేసింది కదాని పదే పదే మళ్ళీ ఇలాంటి వాటి జోలికి వెళ్తే గౌరవం తగ్గిపోయే ప్రమాదం ఉంది
ఇక వాల్తేరు వీరయ్య వైపు కొస్తే ఏ మాత్రం కనీస లాజిక్కులు లేకుండా కాసింత కామెడీ, గంపంత ఎలివేషన్లను నమ్ముకుని దర్శకుడు బాబీ చుట్టేశాడు. చిరంజీవి ఊగిపోయి నటించేశారు. ఆర్మీ ఆఫీసర్లు తమ టీమ్ ని కాపాడేందుకు జాలరి సహాయం కోరడంతో మొదలుపెట్టి మలేషియా అంటే అదేదో మలక్ పేట్ అన్న రేంజ్ లో వీరయ్య భీభత్సం చేయడం దాకా ఎన్నో ఆణిముత్యాలు. సరే మేజిక్ జరిగినప్పుడు పబ్లిక్ ఇవేవీ పట్టించుకోరనుకుందాం. కానీ ఇప్పుడేదో పాస్ చేశారని పదే పదే వాటినే మళ్ళీ భోళా శంకర్ లోనో మరొక దాంట్లోనో రిపీట్ చేస్తే అప్పుడు జరిగే ట్రోలింగ్ కి భాద్యులు ఎవరు. రేపు టివిలోనో ఓటిటిలోనో మొదటిసారి వాల్తేరు వీరయ్యని చూసిన జనాలు దీన్ని థియేటర్లో ఎలా చూశారబ్బా అని కామెంట్ చేస్తే అప్పుడు సమర్ధించుకోవడానికి మాటలు ఉండవుగా.
హిందీలో అమితాబ్ బచ్చన్ ఎలాగో తెలుగులో చిరంజీవిని అంత ఉన్నతంగా చూస్తున్నవాళ్ళు లేకపోలేదు. కాకపోతే ఆ స్థాయికి తగ్గట్టే వెళ్ళాలి తప్పించి శృతి హాసన్ తో అబ్బని తీయని దెబ్బా అంటూ డ్యూయెట్లు వేయడం, చెల్లిపోయిన జోకులతో నవ్వించే ప్రయత్నం చేయడం అన్ని వేళలా పని చేయదు. వేరొకరు కూడా అలాగే చేస్తున్నారు కదానే ప్రశ్న అసంబద్ధం. ఇండస్ట్రీలో ఎవరూ మా మెగాస్టార్ స్థాయి కాదని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నప్పుడు ఇంకొకరితో పోలిక పెట్టుకోవడం వాళ్ళ భాషలోనే చెప్పాలంటే స్థాయిని తగ్గించుకోవడమే కదా. పాతిక సినిమాల చిన్నా చితకా మాస్ హీరో అయితే ఇంత డిస్కషన్ అనవసరం. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న చిరంజీవి అనే మాస్ ఐకాన్ కాబట్టే మీడియాకైనా మామూలోడికైనా ప్రతీదీ భూతద్దంలోనే కనిపిస్తుంది.