Chiranjeevi_Roja_Pawan_Kalyanఏపీ మంత్రులలో చాలామంది మీడియా ముందుకు వచ్చినప్పుడు వారి శాఖలకి, వాటితో రాష్ట్రాభివృద్ధికి సంబందించిన విషయాల గురించి మాట్లాడరు. బహుశః వారికి తమ శాఖలపై పట్టు, అభివృద్ధి పనులపై అవగాహన లేకపోవడమే కారణమై ఉండవచ్చు. కనుక వారు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లపై విమర్శలు, ఆరోపణలు చేయడానికి లేదా వారిని ఎద్దేవా చేస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికే పరిమితమవుతుంటారు. ఇది రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు.

అటువంటివారిలో మంత్రి రోజా కూడా ఒకరు. ఆమె తన పర్యాటకశాఖకి సంబందించి ఎన్నడూ మాట్లాడినా దాఖలాలు లేదు. అసలు ఆ శాఖతో తనకి సంబందమే లేదన్నట్లు ఎప్పుడూ వారిద్దరి గురించే మాట్లాడుతుంటారు. లేదా నెలకోసారి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తమ అధినేత దర్శనానికో లేదా తిరుమల శ్రీవారి దర్శనానికో వెళ్ళివస్తుంటారు.

మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్‌ వంటివారు ప్రజల కోసం ఎంతో చేశారు కనుకనే ప్రజలు వారిని ఆదరించి గెలిపించారు. కానీ ఈ ముగ్గురు మెగా బ్రదర్స్ ఈ రాష్ట్రానికి, ప్రజలకి, కనీసం వారి సొంత జిల్లాలకి చేసిందేమీ లేదు కనుకనే ప్రజలు వారిని చిత్తుచిత్తుగా ఓడించారు. వీరికి రాజకీయ భవిష్యత్‌ లేదు,” అని అన్నారు.

తమ అధినేతని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో ఆమె పవన్‌ కళ్యాణ్‌పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే సంగతి ఆమెకి బహుశః వైజాగ్ విమానాశ్రయంలోనే అర్దమై ఉండాలి. కానీ ఆమె వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోగా ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవిని, వారి సోదరుడు నాగబాబుని కూడా ఉద్దేశ్యించి ఈవిదంగా చాలా చులకనగా మాట్లాడుతూ చిరంజీవి అభిమానులకి కూడా తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నారు.

ఇటీవల చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, “నా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తుంటాడు. రాష్ట్రానికి ఏదో మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇన్ని అగచాట్లు, అవమానాలు భరిస్తున్నాడు. అటువంటి నా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి కొందరు రాజకీయ నాయకులు చాలా చులకనగా మాట్లాడుతుండటం నాకు చాలా బాధ కలిగిస్తోంది. నా తమ్ముడిని ఉద్దేశ్యించి అవమానకరంగా మాట్లాడుతున్నవారే నిస్సంకోచంగా నా దగ్గరకి వచ్చి వారి కార్యక్రమాలకు రావాలని ఆహ్వానిస్తుంటారు,” అని అన్నారు.

చిరంజీవి చెప్పిన ఈ మాటలు మంత్రి ఆర్‌కె.రోజా వంటివారి గురించే అని వేరే చెప్పక్కరలేదు. ఈవిషయం ఆమెకీ అర్దం అయ్యింది కనుకనే ఆమె ఈసారి చిరంజీవిని కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడారనుకోవచ్చు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లు స్థాపించి దశాబ్ధాలుగా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇవికాక ఆయన చేసే గుప్తదానాలకు లెక్కే లేదు. కానీ ఏనాడూ ఆయన వాటి గురించి గొప్పగా చెప్పుకోరు. వైసీపీ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకొన్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోకపోయినా పవన్‌ కళ్యాణ్‌ ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఇప్పటివరకు సుమారు 100 కోట్లు వరకు పంచిపెట్టారు. మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో ప్రజలు జనసేన సభకి స్థలం ఇచ్చినందుకు ప్రభుత్వం రోడ్ల విస్తరణ పేరుతో వారి ఇళ్ళు కూల్చివేయిస్తే పవన్‌ కళ్యాణ్‌ వారందరికీ ఆర్ధికసాయం అందించిన సంగతి అందరికీ తెలుసు. కానీ మంత్రి రోజాకి తెలియదు!

మంత్రి పదవిలో ఉన్నవారు తమకి తిరుగులేదనుకోవచ్చు. కానీ కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ వంటివారినే వారి అధినేత జగన తీసి పక్కన పడేశారు. అది చూసి కూడా రోజావంటివారు ఈవిదంగా మాట్లాడుతుంటే రేపు ప్రజలు కూడా తిరస్కరించకుండా ఉంటారా?ఇటు తమ అధినేతని, అటు ప్రజలని మెప్పించలేనప్పుడు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడితే నష్టపోయేది తామే అని గ్రహిస్తే మంచిది కదా?