Chiranjeevi responds on Mudragada Padmmanabham arrestతుని ఘటన నేపధ్యంలో సీఐడీ జరిపిన విచారణలో భాగంగా ‘ముద్రగడ అండ్ కో’ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడను మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో ఆసుపత్రిలో ఉంచి ప్రత్యేకించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. జగన్ విమర్శల మాదిరే చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ సాగిన లేఖలో… కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేసిన చిరు, కాపుల్లో చిచ్చు పెడుతున్నట్లు వ్యాఖ్యానించారు.

తుని ఘటనను ఎవరూ సమర్ధించరని, అయితే బాధ్యులైన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప కక్ష గట్టినట్లు వ్యవహరించడం తగదని అన్నారు. దీక్ష చేస్తున్న ముద్రగడను అరెస్ట్ చేయడం అనేది సమస్యను పక్కదారి పట్టించడమేనని, సంయమనం పాటిస్తూ, సున్నితమైన సమస్యల పరిష్కారంలో “రాజకీయ పరిణితి”ని ప్రదర్శించాలని కూడా హితవు పలికారు చిరంజీవి. దాదాపుగా శుక్రవారం నాడు జగన్ చేసిన వ్యాఖ్యలకు మరికొన్నింటిని జోడించి చిరు లేఖ విడుదల చేసారు.

అయితే ఈ లేఖలో రాయడంలో ఆయనకైనా స్పష్టత ఉందా లేదా అన్న అంశం చర్చనీయాంశమైంది. ఓ పక్కన దోషులను శిక్షించాలని చెప్పడం… మరో పక్కన ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులకు సమర్ధనీయంగా వ్యాఖ్యలు చేయడం… చిరు మార్క్ స్టేట్మెంట్స్ కు నిదర్శనంగా చెప్పవచ్చు. ఒక నాయకుడికి ‘కులముద్ర’ పడితే వాటి ప్రభావం ఎలా ఉంటాయో ‘ప్రజారాజ్యం, వైఎస్సార్సీపీ’ల ద్వారా చిరంజీవి, జగన్ ల ఉదంతాలు చాటిచెప్పాయి. అది తెలుసుకోకుండా మళ్ళీ కుల రాజకీయాల్లోకి రావడం… బహుశా చిరంజీవి “రాజకీయ పరిణితి”కి అద్దం పట్టే విషయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Chiranjeevi press note