Chiranjeevi requests ys jaganఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి బృందం జరిపిన చర్చల వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో తొలుత చిరంజీవి ప్రసంగించగా, ఆఖరిగా అలీ తన బాణీని వినిపించారు. ప్రభాస్ మరియు కొరటాల శివ అసలు నోరు మెదపలేదు.

ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సినీ అభిమానుల్లో మరియు మీడియా వర్గాలలో పెద్ద చర్చే జరిగింది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ బాగు కోసం మెగాస్టార్ చిరంజీవి అంతగా తగ్గి జగన్ ను విజ్ఞప్తి చేసారు. ‘వినమ్రం’ అనే దాని కంటే మరో ‘పదం’ వినియోగిస్తే సబబుగా ఉంటుందేమో! కానీ ఆ పదం మెగాస్టార్ పై వినియోగించలేనిది.

చిరంజీవి ఆ విధంగా మాట్లాడడం చూసిన మెగా అభిమానులు తీవ్రంగా కలత చెందారు. చిరు మాట్లాడిన వీడియోను షేర్ చేసుకుంటూ మెగా ఫ్యాన్స్ తమ ఆక్రందనను, ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ ల రూపంలో తెలియజేస్తున్నారు.

నిజానికి చిరు అలా మాట్లాడడం ఒక్క మెగా అభిమానులకే కాదు, ఏ సినిమా హీరో అభిమాని కూడా హర్షించలేకపోతున్నారు. ఇండస్ట్రీలో చిరంజీవి స్థానం, స్థాయి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటి చిరు ఇంత దీనంగా వేడుకోవడం ఏ మాత్రం జీర్ణించుకోలేని అంశంగా మారింది.

ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర హీరోల అభిమానులు కూడా దాదాపుగా అదే స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. ‘ఇది ఎంతో ఆనందకరమైన రోజు’ అంటూ మహేష్ చెప్పడంలో ఏమైనా అర్ధముందా? అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇలా స్టార్ హీరోల చేత చెప్పించుకుని జగన్ సాధించింది ఏమిటి?

హీరోలను దేవుళ్లుగా భావించే అభిమానులు కొలువై ఉన్న చోట, అదే హీరోలను అవమానపరిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా? బహుశా నేడు కేవలం సోషల్ మీడియా ద్వారానే అభిప్రాయాలు తెలియజేస్తుండొచ్చు, కానీ ఏదొక రోజున ఓటు వేయాల్సి వస్తుంది, ఆ రోజున ఈ ఉదంతం గుర్తుకు వస్తే తిరిగి మళ్ళీ జగన్ కు ఓటేస్తారా?

ఎంత కాదనుకున్నా, 2019 ఎన్నికలలో జగన్ కు వచ్చిన 50% ఓటింగ్ లో ఆయా హీరోల అభిమానుల ఓట్లు కూడా ఉన్నాయి. మరి ఈ ఓటింగ్ ను దూరం చేసుకునేలా ప్రవర్తించడం వైసీపీకి రాజకీయంగా ఉపయోగకారమా? లేక ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది గనుక, అప్పటికి ఇదంతా ఎవరు గుర్తుంచుకుంటారులే అన్న నమ్మకమా?

అదీ కాక సినీ హీరోల అభిమానులను అసలు పరిగణనలోకి తీసుకునే స్థితిలో జగన్ అండ్ కో లేరా? మరి ఇదంతా దేనికోసం? అంటే రఘురామకృష్ణంరాజు వంటి వారైతే ‘ఈగోయిజం, శాడిజం’ తప్ప మరొకటి లేదంటూ అని రెండంటే రెండు ముక్కల్లో బహిరంగంగానే తేల్చిపడేస్తున్నారు. అంతకుమించి ఒరిగింది ఏమైనా ఉందా? అని నేరుగా ప్రశ్నిస్తున్నారు.

మా ప్రభుత్వం ఈ స్టార్ హీరోల ఓటింగ్ ని పూర్తిగా వదులుకుందని, ఆ హీరోలను అభిమానించే వారు ఎవరైనా మాకు ఓటేస్తారా? ఇంత బుద్ధి తక్కువ పని ఏ ప్రభుత్వము చేయలేదంటూ జగన్ సర్కార్ తీరును ఎండకడుతున్నారు. ఇప్పటికే ఉద్యోగస్తుల ఓటింగ్ పోయింది, ఇప్పుడు ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా దూరమయ్యే విధంగా పరిస్థితులు తెచ్చుకున్నామంటూ తల కొట్టుకున్నారు.

ఎవరైనా మన ఇంటికి వస్తే, తిరిగి వెళ్లే సమయంలో గేటు వద్దకు వెళ్లి సాగనంపడం అలవాటు. కానీ స్టార్ హీరోలను లాన్ లో ఉన్న ఓ డయాస్ వద్దకు పంపి అటు నుంచే పొమ్మనడం మా ముఖ్యమంత్రి చేసిన ఘనతగా ఆర్ఆర్ఆర్ చెప్పుకొచ్చారు. భోజనం సమయంలో వచ్చిన హీరోలకు కనీసం లంచ్ ఆఫర్ కూడా చేయలేదంటూ మండిపడ్డారు.

బయటకు చెప్పినా, లేకున్నా సినీ అభిమానుల భావన కూడా ఇదే. జగన్ ఇంటికి వెళ్లిన ముగ్గురు హీరోలకే ఈ విధమైన అవమానం జరిగి ఉండొచ్చు. కానీ జరిగిన అవమానం, ఇండస్ట్రీ బాగు కోసం వెళ్లిన ఆ ముగ్గురికి కాదు, టాలీవుడ్ మొత్తానికి అంటూ ఫ్యాన్స్ వెళ్లగక్కుతున్న ఆవేదనకు అంతం లేకుండా సోషల్ మీడియా పోస్ట్ లు ఉంటున్నాయి.