Waltair Veerayyaపెద్ద హీరోల సినిమాలొస్తున్న ప్రతిసారి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రేక్షకుల దాకా విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అందులోనూ సంక్రాంతి అయితే ఇక చెప్పేదేముంది. ఇక చిరంజీవి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ క్లాష్ అయితే ఎలా ఉంటుందో వివరణ అక్కర్లేదు. వాల్తేరు వీరయ్య థియేటర్లలో వచ్చింది. వింటేజ్ చిరుని చూపిస్తానంటూ దర్శకుడు బాబీతో పాటు దానికి పని చేసిన ప్రతిఒక్కరు ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలలో ఊగిపోవడంతో అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. పైగా గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్ల పరుగులో వెనుకబడటం ఇప్పటికీ మర్చిపోలేదు. అందుకే ఆ గాయానికి మందు ఈ వీరయ్యేనని ముందు నుంచే ఫిక్స్ అయ్యారు.

అనగనగా ఓ వీరయ్య. జాలరిపేటలో మహా ఫేమస్. ఎంతగా అంటే నేవీ ఆఫీసర్లను మాఫియా ఎత్తుకుపోతే డిపార్ట్ మెంట్ కు చేతకాక ఇతని సహాయం కోరేంత. వాళ్ళను తీసుకొచ్చాక అధికారులంతా ఆయన పడవలోనే పార్టీ చేసుకునేంత. సరే సినిమాటిక్ లిబర్టీలో ఇలాంటి లాజిక్స్ అడగకూడదు కానీ దాంతో మొదలు సదరు వీరయ్య ఓ మాఫియా డాన్ ని ఇండియాకు పట్టుకురావడం కోసం మలేషియా వెళ్లడం, తర్వాత సవతి తమ్ముడు అలియాస్ ఏసిపి విక్రమ్ సాగర్ గతం ఓపెన్ కావడం ఇదంతా ఒక కమర్షియల్ ప్యాకేజ్ ప్రకారం ప్రకారం వెళ్ళిపోతుంది. సరే లార్జర్ దాన్ లైఫ్ కథలు ఇలాగే ఉంటాయి కాబట్టి ఆ శల్యపరీక్షను పక్కన పెట్టేద్దాం.

ముప్పై ఏళ్ళ వెనుకటి మెగాస్టార్ ని మళ్ళీ చూపిస్తానని శపథం చేసిన బాబీ దాన్ని నెరవేర్చుకునే క్రమంలో టైం మెషీన్ వేసుకుని అంతే వెనక్కు వెళ్లి స్క్రిప్ట్ రాసుకోవడంతో వచ్చింది అసలు తంటా. కరుడు గట్టిన క్రిమినల్ ని పట్టుకోవడానికి విదేశాలకు వెళ్లే మనిషి పక్కన ఎలాంటి వాళ్ళు ఉండాలి. ఇక్కడ కమెడియన్లను పెట్టారు. సరే పోనీ హాస్యం కోసం అనుకుందాం. పోనీ అదైనా నవ్వించేలా ఉండాలిగా. ఇప్పుడు చూసినా దొంగ మొగుడు, రౌడీ అల్లుడులో జోకులు ఇంత అవుట్ డేటెడ్ గా అనిపించవు. పేపర్ మీద రాసుకున్నప్పుడు మనకు నవ్వు రావడం కాదు థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ కి నవ్వొచ్చేలా చేస్తున్నామా లేదాని చెక్ చేసుకోకపోతే వచ్చే తంటా ఇది.

మాస్ మహారాజా రవితేజ జట్టు కట్టినప్పుడు హై వోల్టేజ్ యాక్షన్ ఆశిస్తాం. దానికి బదులు హెవీ డ్యూటీ ఎమోషన్ ని చూపిస్తే పబ్లిక్ తట్టుకోగలరా. పూనకాలు అని పాటకే పరిమితం చేస్తే ఎలా.ఫైట్లలోనూ ఉండాలిగా. అన్నదమ్ముల కాంబోలో గూస్ బంప్స్ కోరుకుంటాం కానీ మొహాలు మాడ్చుకుని చివర్లో కన్నీళ్లు పెట్టుకోవడం కాదుగా. అది కూడా ఎక్కువ మోతాదులో. చికెన్ బిర్యానీలో దద్దోజనం కలిపితే ఎలా. ఇంటర్వెల్ లో ఎలివేషన్లు కుదిరాయి సరే రెండు గంటల నలభై నిమిషాల నిడివిని భరించేందుకు అది సరిపోతుందా. చిరంజీవి కష్టం కనిపిస్తుంది. కానీ చెక్కడం సరిగా రాని శిల్పి చేతిలో పడితే అద్భుతం ఎలా జరుగుతుంది. ఇది ఆడేది లేనిది పక్కనపెడితే ఈ పాతకాలం సరుకుతో దుకాణం అట్టే కాలం నడవదు. ఇది అందరికి వర్తిస్తుంది.