ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలలో నక్సలైట్ గా కనిపించింది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. “జల్సా” సినిమాలో పవన్ చేసిన ఆ రోల్ పై సినీ విశ్లేషకులు పెదవి విరిచారు. సీరియస్ గా ఉండాల్సిన నక్సలైట్ రోల్ ను కామెడీతో నింపడం సినిమాకు మైనస్ గా మారడంతో పాటు, పవన్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

మరి పవన్ కళ్యాణ్ నెగ్గలేని ఆ నక్సలైట్ రోల్స్ ను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజలు “ఆచార్య” సినిమాలో చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ రోల్స్ లో చేస్తున్నారా? లేక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఉంటాయా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానీ, ఈ ఇద్దరి లుక్ లైతే అభిమానులకు కన్నులవిందుగా ఉన్నాయి.

విప్లవ నాయకుల పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించాలంటే సాధారణ విషయం కాదు. ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది సమాజంలో చాలా సున్నితమైన అంశం. ఒక ఇమేజ్ ఉన్న హీరో చేస్తే అది చాలామందిపై తీవ్ర ప్రభావం చూపుతుంది గనుక, నేటితరం స్టార్ హీరోలు ఫుల్ లెంగ్త్ రోల్ లో ఆ సాహసం చేయలేకపోయారు.

ఫ్లాష్ బ్యాక్ లో… అప్పట్లో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే విజయవంతం అయ్యారు. ఆ తర్వాత మోహన్ బాబు ఓ ప్రముఖ వ్యక్తి బయోగ్రఫీలో నటించారు గానీ, అది కమర్షియల్ గా సక్సెస్ ను పంచలేకపోయింది. అలాగే ‘ఎన్ కౌంటర్’ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగం చేయగలిగారు గానీ, అప్పటికి కృష్ణ ఇమేజ్ తారాస్థాయిలో లేదు.

ఒక్క ఆర్.నారాయణ మూర్తి వంటి అసాధారణ నటులను మాత్రమే ఆ విప్లవ పాత్రలలో నటించి ప్రేక్షకులకు చేరువ కాగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే… కేవలం అలాంటి రోల్స్ ను మాత్రమే ఆర్.నారాయణ మూర్తి పోషించారు గనుక, ఆ సినిమాలకు ‘బ్రాండ్ అంబాసిడర్’గా మారారు.

మరి స్టార్ హీరోలుగా పూర్తి మాస్ ఇమేజ్ తో చలామణి అవుతోన్న చిరంజీవి – రామ్ చరణ్ లు ఏ విధంగా ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తారనేది ఫిబ్రవరి 4వ తేదీన తేలనుంది. అపజయం ఎరుగని కొరటాల శివ ఏ మాయ చేస్తారనేది ప్రేక్షకులలో ఒకింత ఆసక్తి కలిగిస్తోంది.