Chiranjeevi - Pawan Kalyan Mutli star Movies Tollywoodఇటీవల ఓ సందర్భంలో తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి ప్రకటన చేస్తూ… చిరంజీవి – పవన్ కళ్యాణ్ కాంభినేషన్ లో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అయితే సినీ పరిశ్రమలో ఇలాంటి కామెంట్లు పరమ రొటీన్ గా మారిపోవడంతో, వీటికి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కానీ, ఇవేమీ ఒట్టిగా చెప్పిన మాటలు కాదని, దీని వెనుక నిజంగానే బ్యాక్ గ్రౌండ్ జరిగిందన్న విషయం తాజాగా వెలుగు చూసింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి – పవన్ కళ్యాణ్ కాంభినేషన్ లో అశ్వనీదత్ సహ నిర్మాతగా తానూ ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి ప్రెస్ నోట్ ద్వారా స్పష్టం చేసారు. నిజానికి ఈ వార్త సినీ అభిమానులకు పండగ లాంటిదే అయినా, ఇది పేపర్ ప్రకటనకే పరిమితమయ్యే వార్తా? లేక నిజంగా కార్యరూపం దాలుస్తుందా? వంటి ప్రశ్నలు, సందేహాలు కలగడం సర్వసాధారణమే.

ఈ సందేహాలు తలెత్తడానికి కారణం ఏమిటంటే… గతంలో ఇలాంటి క్రేజీ వార్తలు సినీ అభిమానులు చాలానే విని ఉన్నారు. అలాగే సుబ్బిరామిరెడ్డి గారు కూడా ‘సినిమా ప్రకటన’ అయితే చేసారు గానీ, ‘ఎప్పుడు ప్రారంభమవుతుంది?’ అన్న విషయమైతే ఖరారు చేయలేదు. దీనికి తోడు మరో పక్కన పవన్ కళ్యాణ్ రాజకీయంగా బాగా యాక్టివ్ అవుతుండడంతో, ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం పవన్ చేస్తోన్న ‘కాటమరాయుడు’ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తోనే జతకట్టాల్సి ఉంది. ఈ సినిమా ‘హాసిని అండ్ హారిక’ బ్యానర్లో నిర్మాణం కానుందని ఇప్పటికే త్రివిక్రమ్ స్పష్టం చేసారు. దీంతో ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ మళ్ళీ చిరు – పవన్ లను కలపనున్నారా? లేక నిర్మాత మారి, సీన్ లోకి తిక్కవరపు, అశ్వనిదత్ లు ప్రవేశించరా? అన్నది తెలియాల్సి ఉంది.

అలాగే మరో పక్కన చిరు కూడా తన 151వ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా చేసేందుకు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై చెర్రీ అధికారిక ప్రకటన కూడా చేసారు. దీంతో ఈ సినిమాను పక్కన పెడతారా? లేక ఈ సినిమా పూర్తయిన తర్వాత పవన్ తో సినిమా ఉంటుందా? అన్న లెక్కలేని ప్రశ్నలు మెగా అభిమానుల మదిని తలచివేస్తున్నాయి. ఇద్దరు హీరోల పరిస్థితి ఇలా ఉంటే… త్రివిక్రమ్ వైపు నుండి చూస్తే…

పవన్ తో సినిమా కమిట్ అయిన త్రివిక్రమ్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా, ప్రిన్స్ మహేష్ బాబుతో మరో సినిమా చేయాల్సి ఉంది. జూనియర్ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే ప్రారంభం అవుతుందన్న సంకేతాలు వ్యక్తమవుతుండగా, ప్రిన్స్ మూవీపై కాసింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే త్రివిక్రమ్ తో సినిమాపై మహేష్ అధికారిక ప్రకటన చేసి ఉన్నారు. దీంతో చిరు – పవన్ ల కాంభినేషన్ అనగానే, ఎక్కడలేని సంతోషం వచ్చినా… ఇలాంటి అనేక ప్రశ్నలను కూడా మిగిల్చింది.