Chiranjeevi_Pawan_Kalyan_Remakesఇండస్ట్రీలో అసలు రీమేకే చేయని హీరోలు ఎవరంటే సమాధానం చెప్పడం కష్టం. జెన్యూన్ గా ఒక్క మహేష్ బాబు మాత్రమే వీటి జోలికి వెళ్లని స్టార్ గా చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ పేరుని ఫ్యాన్స్ చెబుతారు కానీ తను చేసిన నరసింహుడుకి మూలం కన్నడలో వచ్చిన దుర్గి. ఒకప్పుడు వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్లో ఎన్నో రీమేకులు చేసిన వాళ్లే. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిప్పి కొడుతున్నారు. మొన్న వచ్చిన బుట్టబొమ్మ కనీసం పబ్లిసిటీ ఖర్చుని వెనక్కు తెచ్చేలా కనిపించడం లేదు.

క్యాస్టింగ్ వల్ల తేడా కొట్టిందా లేక ఇలాంటి కథలను ఓటిటిలో చూసేందుకే ఆడియన్స్ ఇష్టపడుతున్నారా అనేది పక్కనపెడితే కరోనా టైంలో దీని ఒరిజినల్ వెర్షన్ కప్పేలాను చాలా మంది చూసిన మాట వాస్తవం. దాని ప్రభావం వసూళ్ల మీద కనిపించింది. అంతకు ముందు ఓరి దేవుడా లాంటివి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. మెల్లగా మన నిర్మాతలు మలయాళం హిట్ల వెనుక పడటం తగ్గిస్తున్నారు. ప్రాక్టికల్ గా అలోచించి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నమ్మకం వస్తేనే హక్కులు కొనడమో లేదా సెట్స్ పైకి వెళ్లడమో చేస్తున్నారు. అంతే తప్ప తొందపడటం లేదు.

ఒక్క మెగాస్టార్ పవర్ స్టార్ లు మాత్రమే ఇంకా వీటిని అంత సులభంగా వదిలేలా కనిపించడం లేదు. అంత హంగామా చేసిన గాడ్ ఫాదర్ ఏమయ్యిందో ఇంకా పచ్చిగానే ఉంది. టాక్ పాజిటివ్ గా వచ్చినా దాన్ని కలెక్షన్లలోకి మార్చుకోలేకపోయారు. భోళా శంకర్ మీద షూటింగ్ మొదలుపెట్టిన రోజు నుంచే నెగటివిటీ ఉంది. పైగా ఎప్పుడో వచ్చిన వేదాళం రీమేక్ అనగానే ఆసక్తి సగం తగ్గిపోయింది. మరోవైపు పవన్ ఫ్యాన్స్ వద్దని మొత్తుకున్నా తేరికే ఓటేశాడు. హరీష్ శంకర్ ఎన్ని మార్పులు చేసినా మూల కథ అదే ఉంటుంది.

ఓటిటిలో రిలీజైన వినోదయ సితం రీమేక్ మరో అనూహ్య నిర్ణయం. పార్టీ నిధుల కోసం తప్పట్లేదనే మాట నిజమే అయినా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు మరీ పవన్ రేంజ్ అద్భుతాలు చేయలేదు. ఇవే కాదు డ్రైవింగ్ లైసెన్స్ హక్కులు రామ్ చరణ్ వద్దే ఉన్నాయి. మల్టీ స్టారర్ కాబట్టి ఒక మెగా హీరోని పెట్టి మరో స్టార్ తో చేసేందుకు ఆప్షన్లు చూస్తున్నాడు కానీ ఎంతకీ కుదరడం లేదు. మోహన్ లాల్ బ్రో డాడీని తీయాలనే ఆలోచన కూడా ఒక దశలో జరిగింది. కొత్త కథలు పట్టుకుని దర్శకులు బోలెడుండగా ఇలా పదే పదే రీమేక్ ట్రాప్ లో పడటం వల్ల డబ్బులొస్తాయేమో కానీ పూర్తి ఆనందం దక్కదు +