Pawan-Kalyan-Chiranjeeviనట వారసత్వం కనిపించినంత అందంగా పూల బాట మీద నడవదు. ఆ బరువు మోసేవాడికే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తనను ఎవరూ స్టార్ చేయలేదని అంచెలంచెలుగా స్వంతంగా స్టార్ డం తెచ్చుకున్నానని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం మెగా ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. అసలు చిరంజీవి లేకపోతే ఆ సపోర్ట్ తీసుకోకపోతే పవన్ ఇక్కడి దాకా ఎలా వస్తాడనేది వాళ్ళ లాజిక్. దీనికి పవన్ అభిమానులు బదులిస్తూ అలా అయితే మెగా బ్రాండ్ తో వచ్చిన ప్రతి హీరో పవన్ రేంజ్ కి చేరుకోలేదంటూ కౌంటరిస్తున్నారు.నిజానికి పవన్ కొన్ని వందల సందర్భాల్లో అన్నయ్య మీదున్న అభిమానం చాటుతూనే ఉన్నాడు.

రాజకీయ ప్రసంగం కాబట్టి చెప్పాలనుకున్న మాట ఇంకో కోణంలో బయటికెళ్ళిందేమో కానీ తల్లితండ్రులతో సమానంగా చిరు సురేఖలను పవన్ చూసే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఇంకో కోణం చూడాలి. పవన్ కన్నా పదేళ్ల ముందు 1986లో రాక్షసుడుతో చిరంజీవి నాగబాబుని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన్ని సోలో హీరోగా పెట్టి దర్శక నిర్మాతలు సినిమాలు తీశారు. వాళ్లలో ఈవివి, సత్యమూర్తి లాంటి ప్రముఖులున్నారు. ఏవీ ఆడలేదు. నిజం చెప్పాలంటే కెరీర్ ప్రారంభంలో పవన్ కంటే ఎక్కువ పుష్ నాగబాబుకే జరిగింది. కానీ ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా షిఫ్ట్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ అండతో పాటు సాధారణ ప్రేక్షకులు ముఖ్యంగా యూత్ మద్దతు దొరికింది. దానికి తగ్గట్టే తొలిప్రేమ, ఖుషి లాంటి చిత్రాల్లో అచ్చం తమలాగే కనిపించే యువకుడిగా గుర్తించి ఫాలో కావడం మొదలుపెట్టారు. మహేష్ బాబుది కూడా ఇంచుమించు ఇదే స్టోరీ. భారీ బడ్జెట్ తో సామ్రాట్ గా రమేష్ బాబుని కృష్ణగారు గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఓ అయిదారేళ్ళ పాటు సోలో హీరోగా చెప్పుకోదగ్గ సినిమాలు చేశాడు. ఏవీ పెద్దగా ఆడలేదు. తప్పని పరిస్థితుల్లో నటనకు గుడ్ బై చెప్పేశాడు. కానీ మహేష్ కేసు వేరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే టాలెంట్ ప్రూవ్ చేసుకుని వయసొచ్చేనాటికి తనను తాను మలుచుకున్నాడు

జూనియర్ ఎన్టీఆర్ సైతం యాక్టింగ్ వల్లే తక్కువ టైంలో మాస్ హీరో అయ్యాడు కానీ కేవలం తాతయ్య ఎన్టీఆర్ కార్డుని వాడటం వల్ల కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఉంది. గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లినంత మాత్రాన పనైపోదు. అది స్వంతంగా నీళ్లు తాగినప్పుడే అక్కడి దాకా వచ్చినందుకు సార్ధకత. ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ అలా తమకు తాముగా అభిమాన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నవారే. మూలం ఎవరైనా ఉండొచ్చు. కానీ ఎలాంటి ఊతం లేకుండా నిలదొక్కుకున్నప్పుడే అసలైన స్టార్లుగా తయారవుతారు