chiranjeevi pawan kalyan Do you understand what you are doing ఒక భాషలో హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ చేయడం సర్వసాధారణం. అయితే ఇతర భాషలో ఆయా హీరోల ఇమేజ్ ను బట్టి అక్కడి పరిస్థితులను బట్టి అభిమానులు రుచికి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేసి రీమేక్ చేస్తుంటారు. తెలుగులో కూడా ఈ మధ్య ఎక్కువగా రీమేక్ మూవీలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మెగా హీరోలు ఈ తరహా మూవీల‌ను ఎక్కువగా నమ్ముకుంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కెరీర్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలనే చేశారు. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇస్తూ మళ్లీ రీమేక్ మూవీల‌ను నమ్ముకున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మూవీల‌ను రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఇక త్వ‌ర‌లోనే సుజీత్ తో క‌లిసి తేరీ మూవీని, దాంతో పాటు వినోద సిత్తం సినిమాను రీమేక్ చేయ‌నున్నాడు. అటు చిరంజీవి కూడా అంతే. రీ ఎంట్రీ ఇస్తూ రీమేక్ సినిమానే నమ్ముకున్నాడు. తమిళంలో హిట్టయిన మూవీని తెలుగులో ఖైదీ నెంబర్ 150గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు.

మలయాళంలో హిట్టయిన లూసిఫర్ ను కూడా రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అలాగే త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ వేదాలంను కూడా రీమేక్ చేయాల‌ని చూస్తున్నాడు. ఇలా మెగా బ్రదర్స్ ఇద్దరు కూడా ఎక్కువగా రీమేక్ ల‌పై ఆధారపడటం సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకప్పుడు చిరంజీవి తెలుగు డైరెక్టర్లతో సొంతంగా సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన చరిత్ర ఉంది. టాలీవుడ్ లో టాప్ హీరోలు అయినటువంటి ఈ ఇద్దరు రీమేక్ ల వెంట ప‌డ‌టం మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులను కలవర పెడుతోంది.

మలయాళం హీరోలు, తమిళ హీరోలు హిట్ కొట్టి వదిలేసిన సినిమాలు ఇక్కడ చేయడం ఏంటి మీ ఇమేజ్ ఏంటి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా రీమేక్ లు చేయడం వల్ల ఒక వర్గం ప్రేక్షకులను కోల్పోతున్నారని అంటున్నారు. మెగా సినీ అభిమానులు. ఆల్రెడీ హిట్ అయిన మూవీని ఇక్కడ రీమేక్ చేస్తే పెద్దగా అంచనాలు కూడా ఉండవు. హిట్ గ్యారెంటీ అని అంటారు తప్ప కథ పరంగా ఎలాంటి ఊహాగానాలు ఉండవు అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇదే విషయాన్ని ఇప్పుడు మెగా అభిమానులు నెట్టింట్లో వాదిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ ఎలా అయితే సొంతంగా సినిమాలు తీస్తూ సూపర్ హిట్లు కొడుతున్నాడో.. అలా మీరు కూడా చేయండి అంటూ సలహాలు ఇచ్చేస్తున్నారు. మరి మెగా హీరోలు త‌మ ఫ్యాన్స్ ఆవేదనను అర్థం చేసుకుని రీమేక్ లను పక్కన పెట్టి కొత్త కథలతో వస్తారా లేదా అన్నది వేచి చూడాలి.