chiranjeevi-not-related-to-chiranjeevi-international-schoolమెగాస్టార్‌ చిరంజీవి విద్యా రంగంలోకి అడుగుపెట్టారని ‘చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌’ పేరుతో శ్రీకాకుళం పట్టణంలో ఆయన ఓ పాఠశాలను ప్రారంభించారని వార్తలు వచ్చాయి. అంతేకాదు పాఠశాలకు రామ్‌ చరణ్‌ అధ్యక్షుడిగా, నాగబాబు ఛైర్మన్‌గా, చిరంజీవి గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు దాని మీద కొంత స్పష్టత వచ్చింది. పాఠశాలకు, చిరంజీవికి ఎటువంటి సంబంధం లేదని ఆ స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది.

‘‘చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌’ పేరుతో స్థాపించిన సంస్థతో చిరంజీవి, రామ్‌ చరణ్‌, నాగబాబుకు ఎటువంటి సంబంధం లేదు. చిరు అభిమానులమైన మేము సేవా దృక్పథంతో, సామాజిక సృహతో ఈ స్కూల్‌ను స్థాపించాం. మెగా కుటుంబంపై అభిమానంతో చిరంజీవిని గౌరవ వ్యవస్థాపకుడిగా, రామ్‌ చరణ్‌ను గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబును గౌరవ ఛైర్మన్‌గా ఉండాలనే యోచనలో ఉన్నాం. అయితే ఈ స్కూల్‌కు, చిరంజీవి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు’ అంటూ సీఈవో జె. శ్రీనివాస్‌ రావు ప్రకటన విడుదల చేశారు.

సినీ పరిశ్రమలో ఇప్పటికే మోహన్ బాబు కుటుంబం విద్యా రంగంలో ఉన్నారు. మెగా కుటుంబానికి కూడా అనేక రకాలు వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఈ విద్యాసంస్థలతో వారికి సంబంధం లేదు అనేది తేటతెల్లం అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సైరా చిత్రం షూటింగుతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో పాల్గొంటున్నారు. ఇక నాగబాబు విషయానికి వస్తే ఇటీవలే జనసేన తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.

Chiranjeevi International School