Chiranjeevi YS Jaganగత వారం రోజులుగా షూటింగుల పర్మిషన్ కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా తెలంగాణ ప్రభుత్వం చుట్టూ తిరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా పరిశ్రమ ప్రముఖులు సమాలోచనలు జరిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్దకు మాత్రం వెళ్లే ప్రయత్నాలు చెయ్యలేదు. దీనితో జగన్ నొచ్చుకున్నారని వార్తలు కూడా వచ్చాయి.

దీనితో నష్టనివారణ కోసం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు పరిశ్రమ తరుపున వారికి కృతజ్ఞతలు ఫోన్ ద్వారా తెలియచేసాను. లాక్ డౌన్ ముగిసిన తరువాత పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని చెప్పారు,” అని ట్వీట్ చేసారు.

“అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో త్వరలోనే వారిని కలవటం జరుగుతుంది. సింగల్ విండో సిస్టం జీవో ఇచ్చినందుకు, లాక్ డౌన్ తరువాత కలవడానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్,” అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. దీనితో ఈ సమస్య ఇంతటితో ముగిసిపోతుంది అనే అనుకోవాలి.

ఇది ఇలా ఉండగా… షూటింగ్లకు పర్మిషన్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే జీవో కోసం చిత్ర పరిశ్రమ అంతా వేచి చూస్తుంది. జూన్ మొదటి వారం నుండి షూటింగులకు అనుమతి ఇవ్వొచ్చని అంతా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే రకంగా పర్మిషన్ ఇస్తుందని వారు ఆలోచన చేస్తున్నారు.