Bholaa Shankarఅభిమానులు కోరుకున్న ఘనవిజయం వాల్తేరు వీరయ్య రూపంలో చిరంజీవికి గట్టిగానే దక్కింది. పండగ సీజన్ ప్రధాన కారణంగా కనిపిస్తున్నా మెగాస్టార్ స్టామినా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఋజువయ్యిందన్న మాట వాస్తవం. ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్ తోనూ సోసోగా గట్టెక్కడం ఫ్యాన్స్ వెలితిగా ఫీలవుతూ వచ్చారు. కానీ ఇప్పుడా దిగులు లేదు. వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేయడం యుఎస్ లో రెండు మిలియన్ల మైలురాయికి దగ్గరగా వెళ్లడం అంత తేలిగ్గా తీసిపారేసే చిన్న విషయాలు కాదు.

తాజాగా భోళా శంకర్ కొత్త షెడ్యూల్ మొదలైపోయింది. గత ఏడాది ఈ ప్రాజెక్టుకి దర్శకుడిగా మెహర్ రమేష్ పేరు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే అనుమానాలు. బిల్లా లాంటి డీసెంట్ హిట్ అతని ఖాతాలో ఉన్నా శక్తి, షాడో లాంటి కళాఖండాల ద్వారానే బాగా పాపులర్ అయ్యాడు. అందుకే ఇంత గ్యాప్ తర్వాత చిరుని ఎలా డీల్ చేస్తాడోనన్న టెన్షన్ ఉండటం సహజం. మెహర్ రమేష్ మెగాఫోన్ పట్టి ఒకటి రెండు కాదు అక్షరాలా దశాబ్దం దాటింది. ఈ పదేళ్ల కాలంలో మేకింగ్, టెక్నాలజీ, జనాల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి.

మరి వీటికి తగ్గట్టు మెహర్ ఎంత మేరకు అప్డేట్ అయ్యాడనేది సినిమా చూస్తే కానీ చెప్పలేం. అసలే భోళా శంకర్ మళ్ళీ ఇంకో రీమేక్. అజిత్ వేదాళంని ఏరికోరి మరీ తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు తెలుగు డబ్బింగ్ చేయలేదు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఈపాటికి ఓటిటిలో శాటిలైట్ ఛానల్స్ లో అరిగిపోయెదాకా రౌండ్లు కొట్టేది. అలా అని ఇదేమీ కొత్త కథ కాదు. బాషా, సమరసింహారెడ్డి టైపు ఫస్ట్ హాఫ్ ప్రశాంతం సెకండ్ హాఫ్ భీభత్సం రకం రొటీన్ ఫార్ములా. ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్లకే ఎలాంటి కొత్తదనం కనిపించలేదు, సిస్టర్ సెంటిమెంట్ కు మాఫియా బ్యాక్ డ్రాప్ జోడించి పవర్ ఫుల్ హీరోయిజంతో అరవ దర్శకుడు శివ తెరకెక్కించాడు.

వాల్తేరు వీరయ్య లాంటి సక్సెస్ అందుకున్నాక భోళా శంకర్ కు దాని ఫలితం వరమే కానీ ఎటొచ్చి ఏ మాత్రం తేడా కొట్టినా కొన్నవాళ్ళ పాలిట శాపంగా మారుతుంది. వీరయ్యకు ఇంత రెస్పాన్స్ రావడంలో కీలక అంశాలు ఏవి దోహదం చేశాయో గుర్తించి వాటినే మెహర్ కొత్తగా వాడుకుంటాడా లేక ముందు రాసుకున్న స్క్రిప్ట్ కే కట్టుబడతాడా అనేది ఏప్రిల్ లోనే తేలుతుంది. బిజినెస్ పరంగా ఎలాగూ క్రేజ్ వచ్చేస్తుంది. సెలవుల సమయం కాబట్టి కంటెంట్ కనక గట్టిగా పడితే మరోసారి హిట్టు కొట్టొచ్చు. కాకపోతే తెలిసిన మూస కథని ఎలివేషన్లతో మెహర్ రమేష్ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడనేది కీలకం.