Chiranjeevi meeting with fans at Oxygen Bank campపవన్ కళ్యాణ్ ఏదైనా సరే ఒక విషయం పైన స్పందిస్తే అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. కళ్యాణ్ నేచర్ అది, అది కూడా సబబే అంటాను నేను. కళ్యాణ్ బాబు న్యాయం కోసమే పోరాడతాడు, న్యాయం కోసమే వాదిస్తాడు, నేను కూడా అదే న్యాయం కోసం సమయం తీసుకుంటాను, అంతిమంగా మన చిత్తశుద్ధి, హానెస్టీ, మన సంయమనం, మన ఓపిక ఇదే మనకు జీవించి ఉంటాయి, ఆ విషయంలో మాత్రం నేను ఎవ్వరి చేత మాట అనిపించుకోను.

ఇది మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు క్యాంపులో అభిమానులతో భేటీ అయిన సందర్భంలో చెప్పిన వ్యాఖ్యలివి. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడేమి అన్నారు అంటే, ఇప్పుడు అన్న విషయం గురించి కాదు, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి నేడు మెగాస్టార్ తన మద్దతును అభిమానుల సమక్షంలో తెలిపారు. పరోక్షంగా తెలుగు సినిమా టికెట్ ధరలపై పవన్ చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి మద్దతు తెలిపినట్లుగా పేర్కొనవచ్చు. ఎందుకంటే, లేటెస్ట్ గా పవన్ ఈ అంశం పైనే న్యాయపోరాటం గురించి వ్యాఖ్యలు చేసారు.

పవన్ చేసిన రెండు, మూడు నెలల తర్వాత మద్దతు తెలిపితే ఉపయోగం ఏముంటుందో చిరంజీవికి అర్ధమవుతోందా? నాడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత పేర్ని నాని స్వయంగా చిరు ప్రస్తావన తీసుకువచ్చి, పవన్ ను తక్కువ చేసి మాట్లాడినపుడు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే, బయట వ్యక్తుల నుండి కాకపోయినా కనీసం కుటుంబం నుండి అయినా తనకు మద్దతు లభించి ఉండేది, పోరాడడానికి మరింత మనోబలం చేకూరి ఉండేది.

ఈ విషయంలోనే కాదు, ప్రతి అంశంలోనూ చిరంజీవి సాధారణ సమయం కంటే ఎక్కువ సమయాన్నే తీసుకుంటుంటారు. ఈ వీడియోలో అదే విషయాన్ని ప్రస్తావించారు కూడా! అయితే ఈ వేచిచూసే ధోరణి వలన నష్టపోయేది ఎవరు అన్నది మాత్రం ఇన్నాళ్లయినా చిరంజీవి విశ్లేషణ చేసుకోలేదనిపిస్తోంది. నాడు ప్రజారాజ్యంలో టికెట్లు అమ్ముకున్నారు అంటూ ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తే, దానిని తిప్పికొట్టడానికి ఎన్నికలు పూర్తవ్వాల్సి వచ్చింది.

ఒక్కసారి ఫలితాలు వచ్చిన తర్వాత సదరు అంశంపై చిరు స్పందించినప్పటికీ, ఆ వ్యాఖ్యలకు ఏ మాత్రం ప్రాధాన్యత దక్కిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ప్రత్యర్థి పార్టీలు తనను కేంద్రంగా చేసుకుని సోదరుడిపై విషప్రచారం చేస్తున్నా కూడా మెగాస్టార్ మౌనం వహించడం అభిమానులకు కూడా మింగుడు పడలేదు. ఇదంతా ముగిసిన ఏడాదికో, రెండేళ్లకో స్పందిస్తే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది.

ఓ రాజకీయ పార్టీ పెట్టి ఇంత అనుభవం గడించిన తర్వాత కూడా చిరంజీవి తెలుసుకోలేకపోతున్నారంటే ఏమనుకోవాలి? చిరంజీవి అతి మంచితనం ప్రత్యర్థి వర్గాలకు వరంగా మారుతోందా? లేక తనలోని అవగాహనా లోపానికి నిదర్శనంగా నిలుస్తోందా? ఏమో… సినీ ఇండస్ట్రీలో సింహాసనంపై ఉన్న “మెగా బ్రదర్స్” ఇద్దరూ కూడా రాజకీయంగా ఎదగకపోవడానికి కారణం… వారిలో రాజకీయ సఖ్యత లేకపోవడమే అన్నది సుస్పష్టం.